నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో రిపబ్లికన్లు అఖండ విజయం సాధిస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే పోలిస్తే తమ పార్టీ ఈ సారి భారీ తేడాతో గెలుస్తుందని జోస్యం చెప్పారు. పెన్సిల్వేనియాలో నాలుగు వేర్వేరు ర్యాలీల్లో పాల్గొన్న ఆయన... తన పాలనలో అనేక విజయాలు సాధించినట్లు పేర్కొన్నారు.
ఎన్నికల రోజు రిపబ్లికన్ మద్దతు దారులు భారీగా ఓటింగ్‌కు హాజరవుతారని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇది చూసి డెమొక్రాట్లు ఏమీ చేయలేరని అన్నారు.
"ఈ మంగళవారం(ఎన్నికల రోజు) చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇంతకుముందు ఎన్నడూ చూడలేని భారీ రెడ్ వేవ్‌ను మీరు చూస్తారు. అన్నివైపులా ఈ భారీ దళం మోహరించడం వారు(డెమొక్రాట్లు) చూస్తారు. కానీ వారు ఏం చేయలేరు. అమెరికా స్వాతంత్ర్య కథ ప్రారంభమైన రాష్ట్రమిది. ఇక్కడే అమెరికా రాజ్యాంగంపై సంతకం పడింది. మూడు రోజుల తర్వాత అమెరికన్ల కలలను నిలబెట్టే రాష్ట్రం కూడా ఇదే అవుతుంది. ఆ సుందరమైన శ్వేతసౌధంలో మేం మరో నాలుగేళ్లు ఉండబోతున్నాం."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
డెమొక్రాట్ల లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు ట్రంప్. బైడెన్ గెలిస్తే దేశాన్ని సామ్యవాదం వైపు నడిపించి పన్నులు పెంచుతారని ఆరోపించారు. మరోవైపు, దేశ భద్రత విషయంలో తాను అద్భుతంగా పనిచేశానని కితాబిచ్చుకున్నారు. మధ్యతరగతి ప్రజల జీవితాలను బలోపేతం చేసినట్లు చెప్పారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పినట్లు వివరించారు.
"మానవ చరిత్రలో అత్యంత పటిష్ఠమైన, సురక్షితమైన మధ్యతరగతి కుటుంబాలను తయారు చేసేందుకు గత నాలుగేళ్లు కృషిచేశాం. ప్రపంచంలోనే శక్తిమంతమైన సైన్యాన్ని నిర్మించాం. అమెరికాకు ఏది సరైనదైతే నేను అదే చేస్తాను. ఈ విధంగా వాషింగ్టన్లో చాలా మందిని ప్రత్యర్థులుగా చేసుకున్నాను. వారి వ్యతిరేకతను నేను గౌరవంలానే భావిస్తాను. బైడెన్ ప్రణాళికలు అమెరికాను నాశనం చేస్తాయి. నా ప్రణాళికలు వైరస్‌ను అంతం చేసి అమెరికాను గొప్పగా తీర్చిదిద్దుతాయి. ఆయన తన కోసం పనిచేస్తాడు. నేను మీకోసం పనిచేస్తా."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఎన్నిక సందర్భంగా చాలా జాగ్రత్తగా ఉండాలని మద్దతుదారులకు సూచించారు ట్రంప్. అప్రమత్తతతో వ్యవహరించాలని కోరారు.