అమెరికాలో భారత రాయబార కార్యాలయం ఎదుటనున్న మహాత్మాగాంధీ విగ్రహ అపవిత్రం అంశాన్ని.. అత్యంత దారుమైన ఘటనగా అభివర్ణించారు శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్ఎనానే. ఆయన ప్రతిష్ఠను గౌరవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ లాంటి ప్రాంతాల్లో ఇది చాలా అవసరమన్నారు.
భారత్లో కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సిక్కు-అమెరికన్లు చేపట్టిన నిరసనల సందర్భంగా ఖలిస్థానీ వేర్పాటువాదులు వాషింగ్టన్ డీసీలోని మహాత్మాగాంధీ విగ్రహాన్ని అపవిత్రం చేశారు.
ఇదే తరహా ఘటనలు పలు మార్లు జరగటం బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు కైలీ.
ఈ ఘటనపై తమకు సమాచారం అందినట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. అమెరికాలో విదేశీ మిషన్లు, కార్యకలాపాలకు భద్రత కల్పించే విషయానికి కట్టుబడి ఉన్నట్లు వివరించారు. ఇటీవలి పలు ఘటనల నేపథ్యంలో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించినట్లు పేర్కొన్నారు.
ఆఫ్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతితో అమెరికాలో హోరెత్తిన ఆందోళనల్లో.. జూన్ 2న కూడా ఇదే ప్రాంతంలో గాంధీ విగ్రహానికి రంగులు పూసి అపవిత్రం చేశారు నిరసనకారులు. దీనిపై అమెరికా క్షమాపణలు కూడా కోరింది.
ఇదీ చూడండి:అమెరికాలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం