ప్రజాస్వామ్యంలో అప్పుడప్పుడు గందరగోళం ఏర్పడుతుందని, కొంచెం ఓపిక అవసరమని డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ అన్నారు. ఈసారి ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు సాధారణం కన్నా ఎక్కువ సమయం తీసుకుంటోందని తెలిపారు. ప్రతి ఓటు లెక్కించేవరకు శాంతం వహించి ఫలితాల కోసం ఎదురుచూడాలని ప్రజలను కోరారు.
"అమెరికాలో ఓటు పవిత్రమైనది. ఈ దేశ ప్రజలు తమ ఇష్టాన్ని ఓటుతోనే వ్యక్తం చేస్తారు. అమెరికా అధ్యక్షుడిని ఎన్నుకునేది ఓటర్ల సంకల్పమే. అందువల్ల ప్రతి బ్యాలెట్ తప్పనిసరిగా లెక్కించాలి. ఇప్పుడు అదే జరుగుతోంది. కానీ, ప్రజాస్వామ్యంలో ఓపిక చాలా అవసరం. లెక్కింపు పూర్తికాగానే విజయం మమ్మల్నే వరిస్తుంది."
- జో బైడెన్, డెమొక్రటిక్ అభ్యర్థి
అమెరికా మీడియా ప్రకారం.. ఇప్పటివరకు విడుదలైన ఫలితాల్లో బైడెన్ ముందంజలో ఉన్నారు. 264 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన బైడెన్‌కు.. అధ్యక్ష పీఠానికి చేరుకునేందుకు మరో 6 ఓట్లు కావాల్సి ఉంది. లెక్కింపు కొనసాగుతున్న నెవడాలో ఆయన ఆధిక్యంలో ఉన్నారు. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. మరో నాలుగు రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
ఇదీ చూడండి: ట్రంప్ గెలవాలంటే ఇదొక్కటే మార్గం!