భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా రెండో దఫా విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. కానీ, ఈ సమయంలో టీకాలు సరిపడా లేకపోవడం వల్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా ఎక్కువ మందికి తొలి డోసు టీకా వేగంగా అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు. కనీసం ఒక్క డోసు తీసుకున్నా మహమ్మారి నుంచి కొంతైనా రక్షణ లభిస్తుందని వివరిస్తున్నారు. మొట్టమొదటిసారి ఈ విధానాన్ని బ్రిటన్ ఆచరించింది. తొలుత దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. రెండో డోసు ఆలస్యం చేయడం వల్ల పెద్దగా ప్రభావం ఉండదని, తద్వారా తీసుకున్న తొలి డోసు కూడా వృథా అవుతుందన్న విమర్శలు వచ్చాయి. భారత్‌లోనూ ఇటీవల కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య విరామాన్ని పెంచినప్పుడు కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
కానీ, రెండు డోసుల మధ్య విరామాన్ని పెంచాలన్న నిర్ణయాన్ని ఇప్పుడు పలు శాస్త్రీయ అధ్యయనాలు సమర్థిస్తున్నాయి. రెండో డోసు ఆలస్యం చేయడం వల్లే ప్రయోజనం ఎక్కువని సూచిస్తున్నాయి. రెండు డోసుల మధ్య వ్యవధిని రెండు లేదా మూడింతలు చేయడం వల్ల తొలి డోసుకు ప్రతిస్పందించడానికి రోగనిరోధక వ్యవస్థకు అధిక సమయం లభిస్తుందని.. తద్వారా రక్షణశక్తి మరింత బలపడుతుందని వివరిస్తున్నాయి. మొదటి డోసు వల్ల ఏర్పడే యాంటీబాడీల స్థాయిలు సైతం 20 శాతం నుంచి 300ల శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.
తొలిడోసు వీలైనంత ఎక్కువ మందికి
తొలి డోసు వీలైనంత ఎక్కువ మందికి ఇవ్వాలని అమెరికాకు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ గ్రెగరీ పోలండ్ సూచించారు. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో వీలైనంత ఎక్కువమందికి.. సాధ్యమైనంత వేగంగా టీకాలు అందజేయాలన్నారు. తొలి డోసు ద్వారా ఏర్పడ్డ యాంటీబాడీలు పరిపక్వత సాధించినకొద్దీ శరీరంలోని రక్షణ వ్యవస్థ బలపడుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అలాగే రెండో డోసు ఇచ్చినప్పుడు రోగనిరోధక వ్యవస్థ వేగంగా, మెరుగ్గా ప్రతిస్పందించి రక్షణ శక్తిని మరింత దృఢంగా మార్చుకుంటుందని తెలుస్తోంది.
అయితే, తక్కువ సామర్థ్యం ఉన్న వ్యాక్సిన్ల విషయంలో మాత్రం రెండు డోసుల మధ్య విరామం అవసరమైన మేరకే ఉండాలని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే వేగంగా వ్యాపించే శక్తిసామర్థ్యాలు అధికంగా ఉన్న కరోనా వైరస్ రకాలు ఉన్నప్పుడు విరామాన్ని పెంచడం సరికాదని సూచిస్తున్నాయి. పేద, మధ్య ఆదాయ దేశాల్లో తొలి డోసు తీసుకున్న ప్రజలు కొన్ని నెలల తర్వాత తిరిగి రెండో డోసుకు రావడానికి ఆసక్తి చూపకపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భారత్‌లో కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య విరామాన్ని 12-16 వారాలకు పెంచిన విషయం తెలిసిందే. అయితే, 12 వారాలు సరైన వ్యవధి అని.. 16 వారాల వరకు పొడిగించడం వల్ల తలెత్తే ప్రభావంపై పెద్దగా అధ్యయనాలు లేవని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి : కరోనా పుట్టుక లోగుట్టు ఏమిటి?