అమెరికాలో విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి ఐదు లక్షల మంది ప్రాణాలు బలిగొంది. ఇది రెండో ప్రపంచ యుద్ధం, వియత్నాం, కొరియా యుద్ధాల్లో మరణించిన అమెరికన్ల సంఖ్య కన్నా ఎక్కువ. రెండో ప్రపంచ యుద్ధంలో 4,05,000 మంది, వియత్నాం యుద్ధంలో 58 వేల మంది, కొరియన్ యుద్ధంలో 36వేల మంది మృతిచెందారు.
బైడెన్ నివాళి
మృతులకు నివాళిగా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సోమవారం సాయంత్రం మౌనం పాటించారు. ఐదు రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఎగురవేయొద్దని ఆదేశించారు. 'మన ఆప్తులను కోల్పోయామన్న బాధను మనం నియంత్రించుకోవాలి' అని బైడెన్ వ్యాఖ్యానించారు.
ఇంకా పెరిగే అవకాశం..
టీకాలు అందుబాటులోకి వచ్చినా కరోనా మరణాలు తగ్గే అవకాశాలు తక్కువని వాషింగ్టన్ యూనివర్సిటీ అభిప్రాయపడింది. జూన్ 1 నాటికి మృతుల సంఖ్య 5,89,000కు చేరుతుందని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన 25 లక్షల కరోనా మరణాల్లో అమెరికాలోనే 20 శాతం ఉన్నాయి.
డిసెంబరు నుంచి..
అగ్రరాజ్యంలో గతేడాది డిసెంబరు నాటికి 3లక్షల మరణాలు నమోదు కాగా ఆ తర్వాత నెలకు లక్ష చొప్పున మరణాలు నమోదవడం గమనార్హం. జనవరిలో 4లక్షలకు, ఈనెల 5లక్షలకు చేరింది. అయితే సగటు మరణాల శాతం జనవరితో పోలిస్తే ఇప్పుడు తగ్గింది. జనవరిలో రోజుకు 4,000 మరణాలు నమోదైన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇది 1,900కి పరిమితమైంది. గత కొద్ది వారాలుగా మంచు తుపాను ధాటికి ప్రజలు ఇళ్లకు పరిమితం అవడమే ఇందుకు కారణం. భవిష్యత్తులో కొవిడ్ వేరియంట్ల రూపంలో ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టీకాకు ఆటంకాలు..
మంచు తుపాను టీకా పంపిణీ మీద తీవ్ర ప్రభావం చూపింది. ప్రతికూల వాతావరణం కారణంగా సుమారు 60 లక్షల డోసుల్లో మూడో వంతు టీకాల పంపిణీ ఆలస్యమైందని శ్వేతసౌధం వెల్లడించింది. మరిన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.
ఇదీ చదవండి : ఎన్నికల్లో అక్రమాలపై ట్రంప్ దావాల కొట్టివేత