ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అమెరికా 174 మిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించింది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న 64 దేశాలకు ఆర్థిక సహాయార్థం ఈ మొత్తాన్ని వెచ్చించనుంది. ఇందులో భారత్‌కు 2.9 మిలియన్ డాలర్లు కేటాయించింది.
ప్రపంచ విపత్తు స్పందన ప్యాకేజీలో భాగంగా తాజా ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది అగ్రరాజ్యం. గత ఫిబ్రవరిలో ప్రకటించిన 100 మిలియన్ డాలర్లకు ఇది అదనం.
భారత్‌లో వీటి కోసం
ప్రయోగశాల వ్యవస్థలను సిద్ధం చేయడం, సాంకేతిక నిపుణులకు ఆర్థిక తోడ్పాటు సహా పలు కార్యక్రమాల నిమిత్తం భారత ప్రభుత్వానికి 2.9 మిలియన్ డాలర్లు అందిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. గత 20 ఏళ్లలో భారత్‌కు 2.8 బిలియన్ డాలర్ల సహాయం అందించగా అందులో 1.4 బిలియన్ డాలర్లు వైద్య సహాయం చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
"దశాబ్దాలుగా ప్రజా ఆరోగ్య విషయంలో ద్వైపాక్షిక సహాయం అందిస్తున్న అతిపెద్ద దేశం అమెరికా. తీవ్రమైన వ్యాధుల బారిన పడ్డ ప్రజల జీవితాలను అమెరికా రక్షించింది. వైద్య సంస్థలను నెలకొల్పి అన్ని సమాజాలు, దేశాల స్థిరత్వాన్ని ప్రోత్సహించింది."-బోనీ గ్లిక్, అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ
వ్యాధులను గుర్తించడం సహా పర్యవేక్షణ మరింత బలోపేతం చేసేందుకు దక్షిణాసియాకు 1 మిలియన్ డాలర్లు అందిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. 174 మిలియన్ డాలర్లలో శ్రీలంకకు 1.3 మిలియన్ డాలర్లు, నేపాల్‌కు 1.8 మిలియన్ డాలర్లు, బంగ్లాదేశ్‌కు 3.4 మిలియన్ డాలర్లు, అఫ్గానిస్థాన్‌కు 5 మిలియన్ డాలర్లు కేటాయించింది అగ్రరాజ్యం.