కరోనా కారణంగా అమెరికాలో చిక్కుకున్న వేలాది మంది భారతీయ నిపుణులకు ఉపశమనం కలిగిస్తూ అగ్రరాజ్యం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్1బి వీసాల గడువు ముగుస్తుండటం వల్ల వాటి గడువు పొడిగించాలని చేసుకున్న దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. తాజా నిర్ణయంతో భారతీయ నిపుణులు మరింత కాలం అమెరికాలో ఉండడానికి వీలవుతుంది.
హెచ్1బి వీసా అనేది నాన్-ఇమ్మిగ్రెట్ వీసా. సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తుల్లో విదేశీ నిపుణులను నియమించుకునేందుకు యూఎస్ కంపెనీలకు ఇది అనుమతినిస్తుంది. ఫలితంగా అమెరికా టెక్నాలజీ కంపెనీలు... భారత్, చైనా లాంటి దేశాల నుంచి ఏటా వేలాది మంది నిపుణులను నియమించుకుంటున్నాయి.
కరోనాను నివారించేందుకు ప్రపంచ దేశాలు తమతమ సరిహద్దులను మూసివేసిన ప్రస్తుత తరుణంలో అమెరికా హెచ్1బి వీసా గడువు పరిమితిని పొడిగించాలని అమెరికా నిర్ణయం తీసుకోవడం మంచి విషయం.
60 రోజుల్లో...
హెచ్1-బీ వీసా ఉన్న వారిని తొలగించమని ఏ కంపెనీకి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయలేదని అమెరికా తెలిపింది. ఒక వేళ ఎవరినైనా తొలగిస్తే ఆ ఉద్యోగులు.. వారి వీసా గడువు పొడిగించుకునేందుకు 60 రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోవాలని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: స్పెయిన్లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు