కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడిందని ఐక్యరాజ్య సమితి తన తాజా నివేదికలో వెల్లడించింది. కరోనా దీర్ఘకాల ప్రభావాల వల్ల.. 2020-22లో లక్షా 23 వేల నుంచి రెండు లక్షల 93 వేల వరకు అదనపు కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. 69 వేల నుంచి లక్షా 48 వేల అదనపు మరణాలు సంభవించే అవకాశం ఉందని వెల్లడించింది. మహమ్మారి వల్ల 2020 నాటికి సాధించాలనుకున్న లక్ష్యాలు నీరుగారిపోయాయని పేర్కొంది.
గర్భనిరోధక పరికరాలు, ఔషధాల సరఫరాకు అంతరాయం వల్ల అల్ప, మధ్యాదాయ దేశాల్లో జననాల సంఖ్య పెరిగిందని నివేదిక తెలిపింది. కరోనా వల్ల భారత్లో 2.5 కోట్ల జంటలకు వీటి కొరత ఏర్పడిందని స్పష్టం చేసింది.
హెచ్ఐవీ సహా ఇతర మహమ్మారుల విషయంలో తగిన పెట్టుబడులు పెట్టలేని విషయం కరోనా బయటపెట్టిందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. వైద్య రంగంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ప్రాణాలు రక్షించడమే కాకుండా.. బలమైన ఆర్థిక వ్యవస్థలకు పునాదులు వేయవచ్చని స్పష్టం చేసింది. హెచ్ఐవీ నియంత్రణకు అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలు కరోనాతో పోరాడేందుకు ఉపయోగపడ్డాయని పేర్కొంది.
ఇప్పటికీ 1.2 కోట్ల మంది హెచ్ఐవీ బాధితులకు చికిత్స అందడంలేదని డబ్ల్యూహెచ్ఓ నివేదిక వెల్లడించింది. సరైన సదుపాయాలు లేని కారణంగా 2019లో 17 లక్షల మందికి హెచ్ఐవీ సోకిందని తెలిపింది.