ప్రపంచవాప్తంగా 78 కోట్ల కొవిడ్ 19 వ్యాక్సిన్ డోసులు ఇచ్చినప్పటికీ, మహమ్మారి అంతరించడానికి ఇంకా చాలా సమయం ఉందని హెచ్చరించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్. వైరస్ను ఎదుర్కోవడానికి టీకాలు శక్తిమంతమైనవే అయినా అదొక్కటే సాధనం కాదని చెప్పారు.
"వైరస్ను జయించడానికి భౌతిక దూరం, మాస్కులు, వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రత పనిచేస్తాయి. నిఘా, టెస్టింగ్, ట్రేసింగ్, ఐసొలేషన్, క్వారంటైన్ లాంటివాటితోనూ వ్యాధిని అరికట్టవచ్చు. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో కేసులు తగ్గాయంటే.. వైరస్ను మనం కచ్చితంగా అదుపు చేయగలమని అర్థం. అయితే, నిబంధనల అమలులో లోపం, పాటించడంలో నిర్లక్ష్యం వల్ల తీవ్ర ప్రాణ నష్టం జరుగుతోంది."
-టెడ్రోస్, డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్
కరోనాను జయించినవారిలో దీర్ఘకాలిక సమస్యల గురించి మనకు ఇంకా పూర్తిగా తెలియదని టెడ్రోస్ అన్నారు. ఇది ఫ్లూ కాదని హెచ్చరించారు. యువత, ఆరోగ్యంగా ఉన్నవారు కూడా దీనికి బలయ్యారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా టీకాల ఉత్పత్తి పెరగాల్సిన అవసరం ఉందని టెడ్రోస్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: విదేశీ టీకాలకు సత్వర అనుమతులు: కేంద్రం