అమెరికా- చైనా మధ్య 'కరోనా' అగ్గి రాజుకుంది. వైరస్‌కు సంబంధించిన వివరాలను చైనా దాచిపెడుతోందంటూ అమెరికా చేసిన ఆరోపణలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో అగ్రదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాజాగా అమెరికా మరో అడుగు ముందుకేసింది. చైనా నుంచి తమ కంపెనీలు వెనక్కి వచ్చే విధంగా ప్రోత్సాహకాలు అందివ్వాలని ఓ ప్రముఖ చట్టసభ్యుడు కాంగ్రెస్‌లో బిల్లు ప్రవేశపెట్టారు.
"ది బ్రింగ్ అమెరికన్ కంపెనీస్ హోం యాక్ట్"ను చట్టసభ్యుడు మార్క్ గ్రీన్ ప్రవేశపెట్టారు. కంపెనీలు తిరిగి వచ్చేందుకు అయ్యే 100 శాతం ఖర్చును ప్రభుత్వం భరించాలని ప్రతిపాదించారు.
"మన ఆర్థిక వ్యవస్థకు ఊతమందివ్వడం కోసం పెట్టుబడులను ఆకర్షించడం ఎంతో అవసరం. అమెరికాకు తిరిగి రావాలనుకునే కంపెనీలకు ఉన్న ప్రధాన అడ్డంకి.. 'వ్యయం'. కరోనా వైరస్ నేపథ్యంలో అనిశ్చితి నెలకొంది. ఈ సమయంలో వెనక్కి రావాలనుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం, ప్రమాదం అని కంపెనీలు భావిస్తున్నాయి. చైనా నమ్మకమైన భాగస్వామి కాదని రుజువైంది. ఈ సమయంలో అమెరికాను అభివృద్ధి చేయడానికి, చైనాపై ఆధారపడటం తగ్గించడానికి.. అవకాశాలు, పెట్టుబడుల కోసం మన దేశ తలుపులు తెరవాలి. ఇదే నేను ప్రతిపాదించిన బిల్లు."
--- మార్క్ గ్రీన్, అమెరికా చట్టసభ్యుడు.
కరోనా సంక్షోభంలో చైనా ఎత్తుగడల నుంచి అమెరికా వ్యవస్థలను కాపాడుకోవాలంటూ మరో బిల్లును ప్రవేశపెట్టారు గ్రీన్. అమెరికా జాతీయ భద్రతకు కీలకమైన కంపెనీలను ఆదుకోవడానికి పెట్టుబడిదారులకు తగిన ప్రోత్సాహకాలు అందివ్వాలని బిల్లులో ప్రతిపాదించారు.
ఇదీ చూడండి- చైనా చేతిలో డబ్ల్యూహెచ్ఓ ఓ కీలుబొమ్మ: ట్రంప్