అమెరికాలోని చిన్నారుల్లో కరోనా వ్యాప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. దేశంలోని కేసుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉండటం కలవరపెడుతోంది. అమెరికా వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో 10 శాతం చిన్నారులేనని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వెల్లడించింది. ఏప్రిల్తో పోలిస్తే ఈ సంఖ్య 2శాతం అధికమని తెలిపింది. పాఠశాలలు పునఃప్రారంభించడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
చిన్నారుల్లో కరోనా ప్రబలడంపై ఏఏపీ అధ్యక్షురాలు డా. సాల్లీ గోజా ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు వైరస్ కారణంగా అనారోగ్యానికి గురికాకపోయినా.. ఇతరులకు తేలికగా వ్యాప్తి చేసే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి మాస్కులు, సురక్షిత దూరం పాటించడం చాలా ముఖ్యమని తెలిపారు.
టీనేజీ యువతే అధికంగా
సెప్టెంబర్ మొదటి వారం నుంచి కరోనా సోకిన చిన్నారుల సంఖ్య పెరుగుతూ వస్తోందని అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం తెలిపింది. చిన్నపిల్లలతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువగా టీనేజీ యువత కరోనా బారినపడ్డారని వెల్లడించింది. విద్యార్థులు పాఠశాలలకు రావడమే దీనికి కారణమని పేర్కొంది. అయితే పిల్లలకు ఎక్కడ, ఎలా వైరస్ సోకుతుందనే విషయాన్ని సీడీసీ వివరించలేదు.
మార్చి- సెప్టెంబర్ మధ్య 5-17 ఏళ్ల వయసున్న 2,77,000 మంది చిన్నారులకు వైరస్ సోకిందని సీడీసీ తెలిపింది. 51 మంది పాఠశాల విద్యార్థులు మరణించినట్లు వెల్లడించింది. వీరంతా దాదాపు 12-17 ఏళ్ల వయసువారేనని పేర్కొంది. 2 శాతం కన్నా తక్కువ మంది ఆస్పత్రిలో చేరుతున్నారని తెలిపింది. లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు నిర్వహిస్తున్నందున.. వైరస్ సోకిన వారి అసలు సంఖ్య అధికంగా ఉంటుందని పేర్కొంది.
మిసిసిప్పీలో కరోనా బారిన పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య అధికంగా ఉంటోంది. ఇక్కడ జులై-ఆగస్టులోనే పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
తరగతి గదిలో కాదు!
అయితే తరగతి గదుల్లోనే విద్యార్థులకు కరోనా సోకిందన్న వాదనను కొందరు నిపుణులు తోసిపుచ్చారు. క్లాస్ రూంలతో పోలిస్తే ఆట మైదానాలు, నిద్రించే స్థలాల్లోనే ఎక్కువగా కరోనా వ్యాపిస్తోందని చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో వైరస్ నివారణ జాగ్రత్తలు తీసుకోవడం లేదని స్పష్టం చేస్తున్నారు.