భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో.. రెండు వందల రోజులకు పైగా ఉన్నారు అమెరికా, రష్యా వ్యోమగాములు. వారంతా శుక్రవారం క్షేమంగా భూమికి తిరిగొచ్చారు. అయితే ఇక్కడ కరోనా మహమ్మారి ప్రబలంగా ఉన్న నేపథ్యంలో.. అంతరిక్ష యాత్రికులకు స్వాగతం చెప్పే అంశంలో రష్యా అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
అమెరికాకు చెందిన జెస్సికా మెయిర్, ఆండ్రూ మోర్గాన్, రష్యాకు చెందిన ఒలెగ్ స్క్రిపోచ్కాలు.. వ్యోమనౌక ద్వారా కజఖ్‌స్థాన్‌లోని గడ్డినేలల్లో దిగారు. వీరికి కరోనా వైరస్ సోకకుండా రష్యా అంతరిక్ష సంస్థ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వ్యోమనౌక నుంచి వ్యోమగాములను వెలుపలికి తీసుకొచ్చే సిబ్బందిని, వైద్య పరీక్షలు నిర్వహించే బృందాన్ని... దాదాపు నెల రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచారు. వారికి కరోనా నిర్ధరణ పరీక్షలూ చేశారు.
వ్యోమనౌక నుంచి వెలుపలికి వచ్చిన వ్యోమగాములు మాస్కులు ధరించారు. వైద్య పరీక్షల అనంతరం వారిని హెలికాప్టర్‌లో బైకనూర్ తరలించారు. ఐఎస్‌ఎస్‌కు వెళ్లే వ్యోమగాములకు శిక్షణ ఇచ్చే స్టార్ సిటీలో.. గురువారం తొలిసారిగా కరోనా కేసు వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో అక్కడా అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు. భూమికి పయనం కావడానికి ముందు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌లో మాట్లాడారు. కరోనా మహమ్మారి వల్ల గణనీయంగా మారిపోయిన ప్రపంచంలోకి అడుగుపెట్టడం తమకు సవాళ్లతో కూడుకున్న వ్యవహారమని చెప్పారు. అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పుడు తాము కరోనా వార్తలు గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నించినట్లు మోర్గాన్ చెప్పారు. వాస్తవంగా ఏం జరుగుతోందన్నది అర్థం చేసుకోవడం తమకు కష్టమైందన్నారు. అంతరిక్ష యాత్రకు వీరు పయనమయ్యే నాటికి భూమిపై కొవిడ్-19 లేదు.
ఇదీ చదవండి: కరోనా భయంతో ఊరంతా గుండు కొట్టించుకున్నారు!