కరోనా తీవ్రతకు అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతోంది. వాణిజ్యకేంద్రమైన న్యూయార్క్‌లో ఈ వైరస్ దెబ్బకు ప్రజలు గజగజ వణుకుతున్నారు. నలుపు-తెలుపు లేదు, ధనిక-పేద తేడా లేదు, అందరిలోనూ ఈ వైరస్ నుంచి బయటపడటం ఎలా అన్న ఆలోచనే తప్ప మరొకటిలేదు. పరిస్థితి ఎక్కడిదాకా వెళ్తుందో అర్థం కావడం లేదని అక్కడి సీనియర్ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని ప్రస్తుత పరిస్థితిపై అక్కడే ఉంటున్న ఇద్దరు ప్రవాస భారతీయులైన సీనియర్ వైద్యులతో 'ఈనాడు ప్రత్యేక ప్రతినిధి' మాట్లాడారు.
ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు
''నలభై ఆరేళ్లుగా అమెరికాలో ప్రాక్టీసు చేస్తున్నా. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ప్రభుత్వానికి, వైద్యులకు అందరికీ ఇది పెద్ద ఛాలెంజ్‌గా మారింది. పరిస్థితి చేయి దాటిపోతుందేమో అని భయంగా ఉంది. న్యూయార్క్‌లో ఇతర రాష్ట్రాలకంటే తీవ్రత ఎక్కువగా ఉంది. ఇటలీమాదిరిగా తయారవుతోంది. అన్ని రకాల వసతులు ఉన్న ఇక్కడే ఇలా ఉంటే సరైన మౌలిక సదుపాయాలు లేని చోట ఎలా ఉంటుందో ఊహించుకోవడం చాలా కష్టం. న్యూయార్క్‌లో ఉన్న పడకలకు అదనంగా వెయ్యి పడకలను మిలిటరీ సిద్ధం చేసింది. పెద్ద క్రీడా మైదానాన్ని ఆసుపత్రిగా మార్చే పనిలో నిమగ్నమై ఉంది. ఎంత డబ్బున్నా ఏం ప్రయోజనం లేదు. వైరస్ న్యూయార్క్‌లోనే కేంద్రీకృతమవుతుందా? ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తుందా అన్నది మరో పది రోజుల్లో తెలుస్తుంది. ఆ పరిస్థితికి తగ్గట్లుగా సిద్ధమవగలమా లేదా చూడాలి. ఆందోళనకరమేంటంటే 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సుగల యువకులు కూడా ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. 20 శాతం వరకు వీళ్లు ఉంటున్నారు. మరణాల్లో కూడా వీరి సంఖ్య మూడు శాతం వరకు ఉంది. న్యూమోనియా, శ్వాసకోశ సమస్యలతో వచ్చేవారిలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముందస్తు హెచ్చరికలను ఇటలీ పట్టించుకోలేదు. అమెరికా హెచ్చరికలకు తగ్గట్లుగా సిద్ధమైంది. అయినా పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంది. ఇక్కడ మొదటి రెండు వారాల్లో రెండు కేసులు. తర్వాత రెండువారాల్లో యాభైవేల కేసుల వరకు వెళ్లాయి. ఎంత వేగంగా వెళ్తుందో అర్థంకావడం లేదు. ఈ వాస్తవాన్ని ఒప్పుకోకపోతే చాలా కష్టం. కొరియాలో, చైనాలో కేసులు తగ్గాయి. కానీ రెండోసారి మళ్లీ వస్తుందనే భయం ఉంది. ఇది అంత సులభంగా పోయేది కాదు. ప్రస్తుతం అమెరికాలో కూడా క్రమేణా ఒక్కో రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇక్కడ ఆర్థికంగా సమస్యలేదు. ఆసుపత్రులలో రోగులందరికీ ఉచితం చేశారు. ఒక్కో ఆసుపత్రికి ఇంత అని ప్రభుత్వమే నిధులిస్తుంది. భారత్‌లో ఇలా సాధ్యం కాదు. అమెరికాలో చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. ఇటలీలో ఆక్సిజన్ కూడా సరఫరా చేయలేని స్ధితి. నాలుగువేల మంది వైద్యులే వైరస్ బారిన పడ్డారు. అమెరికాలో ఇక్కడ ఉన్న భారతీయులంతా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఇంట్లోనే ఉన్నా పూర్తిస్థాయి వేతనాలు చెల్లిస్తున్నారు. పదవీ విరమణ చేసిన వారు సహా అందుబాటులో ఉన్న వైద్యులందరినీ ప్రభుత్వం పిలిపించింది. దుకాణాలన్నీ ఖాళీ. నీళ్లు కావాలన్నా రేషనే. లింక్ దెబ్బతినడంతో కొరత ఏర్పడింది. ఇంత భయానక పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు.''
భారతదేశంలో వచ్చే రెండు వారాల పాటు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడి మౌలిక వసతులను పరిగణనలోకి తీసుకొంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ప్రజల్లో చైతన్యం తేవడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఎడ్యుకేట్ చేయడం చాలా ముఖ్యం. గ్రామాలు, పట్టణాలు ఎక్కడికక్కడ ప్రణాళికలు ఉండాలి. అధిక సంఖ్యలో పరీక్షలు చేయాలి. ప్రజలే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు వెళ్తే ఏమవుతుందో అన్న ఆందోళన తొలగించాలి. వారికి తీవ్రతను తెలియ చెప్పాలి.
- జయరాం నాయుడు, సీనియర్ వైద్యులు, టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్
(కరోనా నేపథ్యంలో టెక్సాస్ గవర్నర్ మెడికల్ బోర్డుకు నియమించిన 12 మంది సభ్యుల్లో ఒకరు)
దుర్భరంగా ఉంది
''అమెరికాలో పరిస్థితి దుర్భరంగా ఉంది. న్యూయార్క్‌లో 30 వేల మంది వైరస్ బారిన పడ్డారు. వీరిలో 3800 మంది ఆసుపత్రుల్లో చేరారు. ఆసుపత్రుల్లో చేరిన వారిలో 25 శాతం మంది ఐసీయూలో ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్నవారు, గుండెపోటు, మధుమేహంతో బాధపడేవారే కాదు, ఇతరులూ 25 నుంచి 30 శాతం మంది చేరిన వారిలో ఉన్నారు. శత్రువు బలవంతుడు అని గుర్తిస్తే ఎదుర్కోవడం ఎలాగో ఆలోచిస్తాం. అలా కాకపోతే ఏం జరుగుతుందో కళ్లారా చూస్తున్నాం. ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఇక్కడ బయట జనం లేరు, షాపులు లేవు, ఏమీ లేవు. నిర్ణయించిన సమయాల్లో మాత్రమే బయటకు వెళ్లి అవసరమైనవి తెచ్చుకొంటున్నాం. వస్తువుల కొరత చాలా ఎక్కువగా ఉంది. అన్నిటికీ రేషనే. టాయిలెట్ పేపర్ కూడా దొరకడం లేదు. మేము రోగులను ఆసుపత్రిలోకి రానివ్వడం లేదు. ఫోన్లో మాట్లాడటం, టెలిమెడిసన్ అలవాటు చేసుకొన్నాం. ఈ రోజు 25 మంది రోగులకు ఫేస్‌టైం ద్వారానే వైద్యం చేశా. అవసరమైన చోట్లకు డాక్టర్లను పంపుతున్నారు. వచ్చే రోగులందరినీ ఎమర్జెన్సీ గదిలోకి రానివ్వకుండా బయటే పరీక్షలు చేసి, అవసరమైన వారిని మాత్రమే చేర్చుకొంటున్నారు. ఇక్కడ ఉన్న భారతీయులు కూడా గత వారం రోజులుగా దీని తీవ్రతను గుర్తించారు. ఫోన్ చేసి పరస్పరం మాట్లాడుకొని అందరూ బయటకు వెళ్లకుండా ఎవరో ఒకరు మాత్రమే వెళ్తున్నారు. నేను పని చేస్తున్న కొలంబియా విశ్వ విద్యాలయంలో 4500 మంది ఉంటే వెయ్యిమంది వరకు కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిలో దాదాపు 25 శాతం మంది ఐసీయూలో చేరారు. సమస్య ఇంత తీవ్రంగా ఉంది.
భారతదేశంలో ఇక్కడి లాంటి పరిస్థితి వస్తే ఆసుపత్రులు తట్టుకోలేవు. పార్టీలతో సంబంధం లేకుండా అందరూ దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నించాలి. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్ని దేశాల్లో ఎంత తీవ్రంగా నష్టం వాటిల్లిందో భారతదేశ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.''
- డాక్టర్ కుమార్ కలపటపు, ఇంటర్వెన్షల్
(కార్డియాలజిస్టు, కొలంబియా విశ్వవిద్యాలయం, న్యూయార్క్)
వార్తా పత్రికలతో వైరస్ వ్యాప్తికి ఆధారాల్లేవు
వార్తాపత్రికల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఆమెరికాలోని తెలుగు వైద్యులు డాక్టర్ జయరాం నాయుడు, డాక్టర్ కుమార్ కలపటపు తెలిపారు.
'వార్తా పత్రికలను, కరెన్సీ నోట్లను తాకడం ద్వారా కరోనా సోకినట్లు ఆధారాలు లేవు. ఎలాంటి సమాచారం లేదు. మేము కాగితంతో తయారు చేసిన మాస్కులు, రక్షణ గౌన్లనే వాడుతాం. రోజువారీ జీవితంలో కాగితాన్ని విస్తృతంగా ఉపయోగిస్తాం. పత్రికల పంపిణీపై అమెరికాలో కానీ, ఏ ఇతర దేశంలో కానీ ఎలాంటి నియంత్రణలు లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థకూడా ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు. ఎక్కువ తుంపర్ల ద్వారానే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది.' అని డాక్టర్ జయరాం నాయుడు పేర్కొన్నారు. పత్రికలతో వైరస్ ప్రబలుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని డాక్టర్ కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి: కరోనాపై భారత్ పోరాటానికి జీ- 20 దేశాల ప్రశంసలు