Coronavirus Computer Model: కరోనా వేరియంట్లు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రమాదరకరంగా ఉంటున్నాయి. ఈ వైరస్‌లను అత్యంత సమర్థంగా ఎలా అడ్డుకోవచ్చన్నది అవగాహన చేసుకునేసరికే.. లక్షల మంది వీటి బారిన పడుతున్నారు. అయితే కెనడాకు చెందిన వాటర్లూ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సరికొత్త కంప్యూటర్ నమూనాను అభివృద్ధి చేశారు. ఆంటారియో ప్రావిన్స్‌లో డెల్టా వేరియంట్ ప్రబలంగా వ్యాపిస్తున్న సమయంలో- కేసుల సంఖ్య, ఆస్పత్రుల్లో చేరికలు, వ్యాక్సిన్ రేటు, రెండోసారి ఇన్ఫెక్షన్కు గురైనవారి సంఖ్య వంటి వివరాలను పరిగణనలోకి తీసుకున్నారు. తర్వాత వాటి ఆధారంగా కంప్యూటర్ నమూనాను అభివృద్ధి చేసినట్టు పరిశోధనలో పాలుపంచుకున్న ప్రొఫెసర్ అనితా లేటన్ తెలిపారు.
"ఒమిక్రాన్‌ను పోలిన వైరస్‌పై పరిశోధన సాగించాం. దీని తర్వాత పుట్టుకొచ్చే వేరియంట్లను అర్థం చేసుకునేందుకు దోహదపడే కంప్యూటర్ నమూనాను రూపొందించాం. కొత్త వేరియంట్ ఆందోళనకరమైంది అయితే.. దాన్ని సమర్థంగా అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? టీకా కార్యక్రమాన్ని ఏయే ప్రాంతాల్లో వేగంగా చేపట్టాలి? రెండు, మూడు డోసుల మధ్య ఎంత వ్యవధి ఉండాలి? అన్న విషయాలను కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. ప్రత్యేకించి కొన్ని సామాజికవర్గాల్లో వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు ఉపయోగపడేలా ఈ నమూనాను మరింత మెరుగుపరుస్తున్నాం" అని పరిశోధకులు వివరించారు.
ఇదీ చూడండి: రష్యాను భయపెట్టే ఆయుధం ఇదేనా..?