అగ్రరాజ్యంతో వాణిజ్య యుద్ధం కారణంగా తలెత్తిన సమస్యలతో చైనా సతమతం అవుతోందని అన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అందుకే ఆ దేశం వీలైనంత త్వరగా తమతో రాజీ కుదుర్చుకోవాలని చూస్తోందని ఎద్దేవా చేశారు. కానీ ఒప్పందానికి తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు.
సుమారు 350 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై ఇటీవలే 10 శాతం సుంకాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. సెప్టెంబర్ 1 నుంచి పెంచిన సుంకాలు అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు ట్రంప్.
"చైనా ఈ సమస్యను పరిష్కరించాలని అనుకుంటోంది. గడిచిన దశాబ్దాల కాలంలో ఓ చెత్త సంవత్సరాన్ని చవిచూసింది. చైనా పరిస్థితి మరింత దిగజారుతోంది. వేల సంస్థలు చైనాను వీడుతున్నాయి. వారు ఒప్పందం కుదుర్చుకోవాలని అనుకుంటున్నారు. కానీ నేను అందుకు సిద్ధంగా లేను."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
గత ఏడాది నవంబర్ నుంచి పలుమార్లు వాణిజ్య చర్చలు జరిపాయి ఇరు దేశాలు. కానీ అవేవీ ఫలించలేదు.
ఇదీ చూడండి: డొనాల్డ్ ట్రంప్‌కు కిమ్ మరో 'ప్రేమలేఖ'