అమెరికాలోని క్యాపిటల్ భవనం వద్ద జనవరి 6న హింసాకాండ జరిగిన సమయంలో అక్కడే విధుల్లో ఉన్న సిబ్బంది ఆ భవానాన్ని పూర్తిగా మూసేయలేదని పోలీస్ విభాగం ఉన్నతాధికారి యోగానంద పిట్మన్ తెలిపారు. ఆందోళకారులపై చర్యలు తీసుకునేందుకు.. శక్తివంతమైన బలగాలను వినియోగించడంలో ఉన్న నిబంధనలపై అక్కడి అధికారులకు అవగాహన లేదని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన నివేదికను ప్రతినిధుల సభకు ఆమె అందించారు. క్యాపిటల్ ఘటనపై పోలీసుల స్పందన సహా.. కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోవడానికి గల కారణాలను వివరించారు.
క్యాపిటల్ దాడి జరగక ముందు పోలీసులు అంతర్గత మదింపు చేసుకున్నారని చెప్పారు పిట్మన్. శ్వేతజాతి ఆధిపత్యవాదులు, ఇతర అతివాద బృందాలు నిరసనల్లో పాల్గొనే అవకాశం ఉందని అనుమానించినట్లు తెలిపారు. బైడెన్ విజయాన్ని నిర్ధరించేందుకు క్యాపిటల్‌లో జరుగుతున్న సమావేశానికి ఆటంకం కలిగించేందుకు నిరసనకారులు ఆయుధాలను సైతం వెంటతెచ్చుకుంటారని భావించినట్లు చెప్పారు.
"2020 నవంబర్, డిసెంబర్లలో జరిగిన ఆందోళనల మాదిరిగా ఈ నిరసనలు ఉండవని ముందుగానే మేం నిర్ధరణకు వచ్చాం. ముప్పును గ్రహించి చర్యలు తీసుకున్నాం. భద్రతను పెంచాం. అదనపు బలగాలను మోహరించాం. కాంగ్రెస్‌లోని కీలక నేతలకు రక్షణ అధికం చేశాం. శాసనసభ్యులకు భద్రత కల్పించే ఏజెంట్లకు అసాల్ట్ రైఫిళ్లను అందించాం. వాషింగ్టన్‌లోని ప్రతి ప్రాంతంపై నిఘా ఉంచేలా కౌంటర్ సర్వైలెన్స్ ఏజెంట్స్‌ను నియమించాం."
- యోగానంద పిట్మన్, క్యాపిటల్ పోలీస్ చీఫ్
కొందరు వాకీటాకీలు తీసుకొచ్చిన నేపథ్యంలో రేడియో ఫ్రీక్వెన్సీలనూ అధికారులు నిలిపివేశారని పిట్మన్ తెలిపారు. ఆందోళనకారుల సంభాషణను గమనించారని చెప్పారు. అయితే ఘటన సమయంలో అంతర్గత సవాళ్లను ఎదుర్కొన్నట్లు వివరించారు పిట్మన్. క్యాపిటల్ కాంప్లెక్స్ వద్ద లాక్డౌన్ విధించాలని రేడియో మాధ్యమం ద్వారా ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. ఆ భవనాన్ని అధికారులు సరిగా మూసేయలేదని చెప్పారు. ఏ సమయంలో ప్రమాదకరమైన బలగాలను వినియోగించాలనే విషయంపై వారికి స్పష్టత లేదని అన్నారు. తక్కువ ప్రమాదకరమైన ఆయుధాలు తాము ఆశించిన స్థాయిలో పనిచేయలేదని చెప్పారు.
ఇవీ చదవండి: