అమెరికా లాస్ఏంజెల్స్లో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. మంటలు అంతకంతకూ వ్యాపిస్తున్నాయి. మొత్తం మూడు చోట్ల అగ్నికీలలు భీకరంగా విజృంభిస్తున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. అధిక ఉష్టోగ్రత కారణంగా తేమ శాతం తగ్గి.. మంటలు మరింత వ్యాపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీని వల్ల మంటలను అదుపు చేయటం కష్టంగా మారిందని వెల్లడించారు.
మంటలు వేగంగా విస్తరిస్తున్న తరుణంలో లాస్ ఏంజెల్స్‌కు ఉత్తరాన ఉన్న ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్నికీలల కారణంగా కాలిఫోర్నియా ఆంటెలోప్ లోయ ప్రాంతాన్ని దట్టమైన నల్లటి పొగ అలుముకుంది.
లేక్ ఫైర్ అని పిలిచే ఈ ప్రాంతంలో కార్చిచ్చు కారణంగా 88శాతం కాలిపోగా, 12శాతం మాత్రమే మిగిలి ఉందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఫలితంగా 5,400కిపైగా ఇళ్లు, 59.5 చదరపు కిలోమీటర్ల చెట్లు కాలి బూడిదయ్యాయి. మరో ఐదు ఇళ్లతో సహా 21 భవనాలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. అంతేకాకుండా హ్యూస్ సరస్సు సమీపంలోని ఏంజిల్స్ నేషనల్ ఫారెస్ట్‌లోనూ మంటలు చెలరేగాయి.
ఆంటెలోప్ వ్యాలీలో ఉష్ణోగ్రతలు 111 డిగ్రీల సెల్సియస్‌ను తాకవచ్చని జాతీయ వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 24 నుంచి 32 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది. అందువల్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.