కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత బ్రెజిల్లో నాలుగో వ్యక్తి.. వైద్య శాఖ బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో తనకు అనుకూలంగా మాట్లాడిన ఆ దేశ కార్డియాలజీ సొసైటీ అధ్యక్షుడు మార్సెలో క్వీరోగాను ఈ మంత్రి పదవికి ఎంపిక చేశారు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో. ప్రస్తుతం వైద్య శాఖ మంత్రిగా ఉన్న ఎడుయార్డో పాజులో స్థానాన్ని ఈయన భర్తీ చేయనున్నారు.
ఈ పదవికి కార్డియాలజిస్ట్ లూథ్మిలా హజ్జర్ను తొలుత ఎంపిక చేశారు బొల్సొనారో. అయితే ఈ అవకాశాన్ని హజ్జర్ తిరస్కరించారు.
విభేదాలే కారణం
ఆర్మీ జనరల్ అయిన పాజులోను గతేడాది మేలో వైద్య శాఖ మంత్రిగా నియమించారు బొల్సొనారో. ఆయనకు వైద్య రంగంలో ఎలాంటి అనుభవం లేదు. పాజులోకు ముందు పనిచేసిన ఇద్దరు మంత్రులు.. బొల్సొనారోతో విభేదాల కారణంగా తమ పదవుల నుంచి దిగిపోయారు. భౌతిక దూరం నిబంధనలను బొల్సొనారో వ్యతిరేకించడం, యాంటీ మలేరియా ఔషధాల ఉపయోగాన్ని సమర్థించడాన్ని మంత్రులు స్వాగతించలేదు. 2020 మే 15న నెల్సన్ టీచ్ ఈ శాఖకు రాజీనామా చేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నాలుగు వారాలకే బాధ్యతల నుంచి వైదొలిగారు. అయితే పాజులో పదవిలోకి వచ్చిన తర్వాత.. బొల్సొనారో ఆదేశాల ప్రకారం నడుచుకున్నారు. కరోనా రోగులకు మలేరియా మందులు సరఫరా చేయడాన్ని ప్రారంభించారు.
సగటున 1800 మంది బలి
కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో బ్రెజిల్ ఒకటి. ఇప్పటివరకు ఆ దేశంలో 2.80 లక్షల మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం సగటున రోజుకు 1,800 మంది మరణిస్తున్నారు. కీలక రాష్ట్రాల్లో వైద్య వ్యవస్థ అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలోనే పాజులోను తొలగించాలన్న డిమాండ్ పెరిగింది. పాజులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై అక్కడి న్యాయస్థానం విచారణ జరుపుతోంది.
ఇదీ చదవండి: 'భారత్, పోర్చుగల్ మధ్య సోదర బంధం'