ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఆట... కుస్తీ. లింగ బేధాలు లేకుండా స్త్రీ, పురుషులిద్దరూ కుస్తీలో పాల్గొంటారు. ఆటలో భాగంగా ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన దుస్తులను ధరిస్తుంటారు. సాధారణంగా స్త్రీలు కూడా పొట్టి దుస్తుల్లోనే దర్శనమిస్తుంటారు. అయితే, దక్షిణ అమెరికాలోని బొలీవియా దేశ స్త్రీలు మాత్రం సంప్రదాయ దుస్తులు, టోపీలు ధరించి కుస్తీ ఆటను ఆస్వాదిస్తున్నారు. ప్రముఖ మెక్సికో రెజ్లర్ రెమిస్టీరియో తరహాలో మొహానికి మాస్క్‌లతో కుస్తీ పడుతున్నారు.
'ఛోలీతాస్ ఆఫ్ బొలీవియా'గా పిలుచుకునే ఈ కుస్తీ ఆటను ఆయ్మారా, క్వెఛ్వా మహిళలకు గుర్తుగా జరుపుకుంటారు. ఆటప్రారంభానికి ముందు పోటీదారులు రింగ్‌లోకి ప్రవేశించగానే సంప్రదాయ సంగీతానికి నృత్యం చేస్తారు.
రేనా టొర్రెజ్ శిక్షణ
కుస్తీలో 12 ఏళ్ల అనుభవమున్న 'రేనా టొర్రెజ్' తన విన్యాసాలతో అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు కొత్తతరం రెజ్లర్లను తయారుచేసేందుకు 16 నుంచి 19 ఏళ్ల వయసున్న వారికి శిక్షణ ఇస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 50 మంది యువతులు వేర్వేరు ప్రదేశాల్లో ఛోలీతాస్ ఆఫ్ బొలీవియాకు సన్నద్ధమవుతున్నారని అక్కడి అధికారులు తెలిపారు.
"ఈ ఆటలో పాల్గొనాలనుకునే మహిళలకు చాలా ధైర్యం, బలం, ఆత్మస్థైర్యం ఉండాలి. ఎందుకంటే ఇది ఎంతో క్రమశిక్షణ కలిగిన ఆట"- రేనా టొర్రెజ్, శిక్షకురాలు