''మేం చిన్నప్పుడు.. ఎక్కువగా అణుయుద్ధాల గురించి భయపడేవాళ్లం. అణుదాడి వచ్చినప్పుడు.. బేస్మెంట్ కిందకు వెళ్లి డబ్బాల్లో తలదాచుకునేవాళ్లం. అందులోనే నీళ్లు, ఆహారం పెట్టుకునేవాళ్లం.
ప్రస్తుత ప్రపంచం ఇలాంటి విపత్తుల్ని చూడకపోవచ్చు. కానీ రానున్న కొన్ని దశాబ్దాల్లో.. యుద్ధంలో కాకుండా 10 మిలియన్ల మందిని ఏదైనా చంపినట్లయితే.. అది అత్యంత ప్రమాదకర వైరస్ కావొచ్చు. దాడి చేసేది క్షిపణులు కాదు. సూక్ష్మజీవులు. ఆ విపత్తును ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా లేం. అంటువ్యాధిని ఆపేందుకు చాలా తక్కువ పెట్టుబడులు పెట్టాం. కానీ.. అణ్వస్త్రాలను మార్గమధ్యంలోనే అంతం చేసే శస్త్రాలపై మాత్రం భారీగా వెచ్చించాం.''
కరోనా వైరస్ గురించి 2015లోనే దిగ్గజ వ్యాపారవేత్త బిల్ గేట్స్ చెప్పిన మాటలివి. ఓ మహమ్మారి దాడి చేస్తుందని ఆయన ప్రజాముఖంగా టెడ్ టాక్‌లో చెప్పడం విశేషం. కరోనా వెలుగుచూడని ఆరేళ్లకు ముందే ఆయనకు ఎలా తెలిసింది. ఇంకా ఆయన ఎన్నో విషయాలు చెప్పారు.
అంచనాలకు తగ్గట్లే..
ఆయన చెప్పినట్లే.. 2019 ఆఖర్లో చైనాలో మొదలై ప్రపంచ దేశాలకు పాకింది అంటువ్యాధి కరోనా. దాదాపు 18 కోట్ల కేసులు, 40 లక్షలకుపైగా మరణాలు సంభవించాయి. అంతకుముందు 1976లో తొలిసారి బయటపడ్డ ప్రాణాంతక వ్యాధి ఎబోలా వైరస్.. 2013-16లో తీవ్రంగా మారింది. అప్పట్లో 11 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
సరైన వ్యవస్థే లేదు..
అప్పట్లో ఎబోలా నియంత్రణకు ఏర్పాటు చేసిన వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, అసలు సరైన వ్యవస్థే లేదని విమర్శించారు గేట్స్. ''వ్యాధిని పరిశీలించేందుకు నిపుణులు సిద్ధంగా లేరు, ఎంతమేర వ్యాప్తి చెందిందని చెప్పేవారు లేరు. ఒక పెద్ద మహమ్మారి వచ్చిందంటే చాలా మంది సిబ్బంది అవసరం. ప్రపంచ దేశాలకు పంపాలంటే ఎన్నో ఏర్పాట్లు చేయాలి. కానీ ఎవరూ లెక్కచేయలేదు. ఆ దిశగా ఎవరూ ఆలోచించలేదు. ఇంకా.. కేసులు నివేదించడం ఆలస్యమైంది. ఇక ఆన్లైన్లో పెట్టేసరికి పరిస్థితి విషమించింది.'' అని వివరించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
''ఇది నిజంగా అంతర్జాతీయ వైఫల్యమే. ఇలాంటి అంటువ్యాధులను పర్యవేక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిధులను సమకూరుస్తుంటుంది. కానీ చెప్పిన వాటికి మాత్రం కాదు. సినిమాల్లో మాత్రం వేరేలా ఉంటుంది. వైద్య బృందం వెళ్లడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ అప్పటికే ఆలస్యమవుతుంది. కానీ అది హాలీవుడ్‌లోనే.''
- బిల్ గేట్స్
అధ్వాన పరిస్థితులు..
ఇంకా రాబోయే వైరస్ మరింత వినాశనకరంగా ఉంటుందని హెచ్చరించారు గేట్స్. అయితే.. ఎబోలా వ్యాప్తి ఎక్కువగా విస్తరించకపోవడానికి ఆరోగ్య కార్యకర్తలు పోరాటం, గాలి ద్వారా వ్యాపించకపోవడం, పట్టణ ప్రాంతాల్లో వ్యాప్తి చెందకపోవడమేనని, ఇది నిజంగా అదృష్టమని చెప్పారు.
కానీ, తదుపరి విపత్తు నాటికి అంత అదృష్టం ఉండకపోవచ్చని, ఎక్కడైనా వైరస్ ఉండొచ్చని తెలిపారు. వచ్చే వైరస్ కృత్రిమంగా సృష్టించింది(బయోటెర్రరిజం) అయినా, సహజసిద్ధ వైరస్ అయినా.. పరిస్థితులు అధ్వాన్నంగా ఉంటాయని వివరించారు.
''గాలి ద్వారా సోకే.. 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూనే చూద్దాం. అప్పుడేమైంది. ఇది చాలా వేగంగా ప్రపంచ దేశాలను చుట్టేసింది. 30 మిలియన్ల కంటే ఎక్కువమందినే బలిగొంది. కాబట్టి ఇది తీవ్రమైన సమస్య. మనం ఆందోళన చెందాల్సిందే.''
- బిల్ గేట్స్
మనకు ఆ సత్తా ఉంది?
ప్రస్తుత శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో వైరస్‌ను ఎదుర్కొనే సత్తా మనకు ఉందని, ఒక మంచి వ్యవస్థను సృష్టించుకోవచ్చని 2015లోనే వివరించారు బిల్ గేట్స్. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే.
- అందరి దగ్గర సెల్ఫోన్లు ఉన్నాయి. ప్రజలతో సంభాషణలు జరపొచ్చు. వారికి సమాచారం అందించొచ్చు.
- ప్రజలు ఎటు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో చూసేందుకు మనకు శాటిలైట్ మ్యాప్స్ ఉన్నాయి.
- మనం జీవశాస్త్రంలో ఎంతో పురోగతి సాధించాం. ఒక వ్యాధికారక కణాన్ని కనిపెట్టి.. దానిని తట్టుకొనే ఔషధాలు, వ్యాక్సిన్లను తయారుచేయగలం.
- వైరస్‌ను ఎదుర్కొనేందుకు మనకు ఇన్ని సాధానాలు ఉన్నాయి. ప్రపంచ దేశాలు వీటిని అవలంబించాలి.
- నిజం చెప్పాలంటే వైరస్‌ను ఎదుర్కొనేందుకు.. మనం ఒక మంచి వ్యవస్థను తయారుచేయగలం.
యుద్ధంలా భావించాలి..
⦁ సైనిక ముప్పులను ఎంత తీవ్రంగా తీసుకుంటామో, వైరస్ దాడులను అలాగే పరిగణించాలి. మనకు వెళ్లడానికి చాలా సమయం ఉంది.
⦁ ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా చాలా వేగంగా బలగాలను మోహరించేందుకు నాటోకు మొబైల్ యూనిట్ ఉంది. దీనిని ఉపయోగించుకోవాలి.
ఇదీ చదవండి: 'కరోనాను ఎదుర్కొనేందుకు ధనిక దేశాలు సహాయం చేయాలి'
ఈ ఐదు పాఠాలు నేర్చుకోవాలి..
- ఆరోగ్య వ్యవస్థ: పేద దేశాల్లో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయాలి. అప్పుడే తల్లులు సురక్షితంగా జన్మనివ్వగలరు. పిల్లలకు టీకాలివ్వొచ్చు.
- వైద్య సిబ్బంది: శిక్షణ పొందిన, అలాంటి నేపథ్యం ఉన్న వైద్య సిబ్బంది అవసరం. వారు వైద్య నిపుణులతో వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి.
- మిలిటరీ: వైద్య సిబ్బందిని మిలిటరీకి అనుసంధానం చేయాలి. వేగంగా వెళ్లడానికి, అన్ని వనరులు సమకూర్చడానికి ఇది తప్పనిసరి.
- జెమ్స్ గేమ్స్: భవిష్యత్తు యుద్ధాలకు సన్నద్ధం అవడం కోసం ఎలాగైతే వార్ గేమ్స్ నిర్వహిస్తారో, అలాగే జెమ్స్ గేమ్స్‌ను నిర్వహించాలి.
- ఆర్ అండ్ డీ: చివరగా డయాగ్నోస్టిక్స్‌లో పరిశోధన, అభివృద్ధి అవసరం.
లక్షల కొద్దీ మరణాలు సంభవించే అవకాశం ఉంది కాబట్టి.. దీనికి కచ్చితంగా ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు బిల్ గేట్స్.
ఇదీ చదవండి: 'వచ్చే 4-6 నెలలు కరోనా మరింత తీవ్రం'
చివరగా..
''మనం భయపడాల్సిన పని లేదు. ఎబోలా మహమ్మారి నుంచి బయటకు రావడం నిజంగా సానుకూల అంశం. ఇప్పుడు సిద్ధం కావడానికి ఒక మేల్కొలుపు లాంటిది. అందుకే మనం ఇప్పుడే ప్రారంభిస్తే.. తదుపరి అంటువ్యాధిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండొచ్చు.''
- బిల్ గేట్స్
ఇవీ చదవండి: బిల్ గేట్స్ జీవితంలో చీకటి కోణం... అందుకే అలా...