డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అన్ని అంశాల్లో అడ్డంకులు సృష్టిస్తోన్నా అధికార బదిలీ ప్రక్రియకు మార్గం సుగమం చేసుకుంటున్నారు బైడెన్. తన కేబినెట్ కూర్పుపై కసరత్తులు ముమ్మరం చేశారు. మంగళవారం బైడెన్ తన తొలి కేబినెట‌్ మంత్రులను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో జనవరిలో జరిగే అధ్యక్ష ప్రమాణ స్వీకార కార‌్యక్రమంపైనా ప్రణాళికలు రచిస్తున్నారు. మంత్రులుగా ఎవరుంటారనేది బైడెన్ తొలుత ప్రకటిస్తారని త్వరలో ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమితులుకానున్న రాన్ క్లెయిన్ చెప్పారు. బైడెన్...ఈవారంలోనే తన ఆర్థికమంత్రి లేదా విదేశాంగ మంత్రులను ప్రకటించే అవకాశం ఉందని అసోసియేటెడ్ ప్రెస్ సైతం తెలిపింది.
చరిత్రలోనే తొలిసారి అమెరికా రక్షణ విభాగం- పెంటగాన్ లేదా ఖజానా విభాగం లేదా డిపార్ట్‌మెంట్ ఆప్ వెటరన్ ఎఫైర్స్ అధిపతిగా మహిళను నియమించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయా శాఖల్లో తొలి ఆఫ్రికన్-అమెరికన్‌ను నియమించే అవకాశాలున్నట్లు సమాచారం.ఆర్థికశాఖ మంత్రిపై ఇప్పటికే బైడెన్ ఒక నిర‌్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా సాధారణ సేవల విభాగం-జీఎస్ఏ బైడెన్‌ను ఎన్నికైన అధ్యక్షుడిగా గుర్తించకపోవడం వల్ల ఆయన తన తదుపరి కార్యాచరణను వేగవంతం చేయలేకపోతున్నారు.
ఇదీ చూడండి: బైడెన్‌ను అధ్యక్షుడిగా గుర్తించను: పుతిన్