అంతర్జాతీయ నిబంధనలకు లోబడి చైనా వ్యవహరించేలా చూస్తామన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ప్రపంచంలోనే శక్తిమంతమైన, సంపన్న దేశంగా ఎదిగి ఆధిపత్యం సాధించాలని చైనా చూస్తోందన్నారు. అయితే తాను ఉన్నంతవరకు అది జరగదని గురువారం తన తొలి మీడియా సమావేశంలో చెప్పారు.
"దక్షిణ చైనా సముద్రం, ఉత్తర చైనా సముద్రం, తైవాన్‌పై ఒప్పందం తదితర అంశాల్లో నిబంధనలకు చైనా కట్టుబడి ఉండేలా చేస్తాం. నిరంకుశత్వమే భవిష్యత్తు అని జిన్‌పింగ్ భావిస్తున్నారు. ఆయనకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదు. చైనాతో విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ దానితో ఘర్షణ పడటానికి సుముఖంగా లేమని జిన్‌పింగ్‌కు ఇదివరకే చెప్పా."
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
వ్యూహాత్మకం..
వ్యూహాత్మక కారణాల దృష్ట్యా అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణకు నిర్దేశించిన గడువు (మే1)లోగా ఆ ప్రక్రియ ముగిసిపోదని బైడెన్ స్పష్టం చేశారు. అక్కడ సుదీర్ఘ కాలం ఉండటం తమ ఉద్దేశం కాదని చెప్పారు. ఈ ప్రక్రియను సురక్షితంగా, క్రమపద్ధతిలో జరుపుతామని తెలిపారు.
మరోసారి సై!
2024లో అమెరికా అధ్యక్ష పదవికి మరోసారి పోటీ చేసే ప్రణాళిక ఉందన్నారు ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో కలిసి బరిలోకి దిగేందుకు ఆసక్తిగా ఉన్నానని చెప్పారు
"మరోసారి ఎన్నికల్లో నిలబడే ప్రణాళిక ఉంది. పోటీ చేయాలనే భావిస్తున్నా. అయితే నేను విధిని బలంగా నమ్ముతా. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో ఊహించలేం. కమల చాలా బాగా పనిచేస్తున్నారు. ఆమె గొప్ప భాగస్వామి."
- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
78 ఏళ్ల వయసులో ఇప్పటికే అమెరికా అధ్యక్ష పదవి చేపట్టి వయోధికుడిగా ఉన్న బైడెన్.. 2024కు 82ఏళ్లు పూర్తి చేసుకుంటారు. అయితే మరోసారి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోటీ పడతారా? అని అడిగినప్పుడు.. అప్పటికీ రిపబ్లికన్ పార్టీ ఉంటుందా? అని తిరిగి ప్రశ్నించారు బైడెన్. అయితే ఎవరితో పోటీ పడేది విధి నిర్ణయిస్తుందన్నారు.
ఇదీ చూడండి: భారత్-రష్యా బంధంపై అమెరికా కీలక వ్యాఖ్యలు