Biden Putin call: ఉక్రేయిన్ సరిహద్దుల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. బీజింగ్ ఒలింపిక్స్ ముగిసేలోపు రష్యా ఆ దేశంపై దాడి చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో బైడెన్ ఫోన్లో సంభాషించారు. దాదాపు గంట పాటు పుతిన్‌తో మాట్లాడిన బైడెన్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు శ్వేతసౌధం వెల్లడించింది.
బైడెన్ వార్నింగ్..
ఉక్రేయిన్‌పై దండయాత్రకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని బైడెన్ పుతిన్‌ను హెచ్చరించినట్లు శ్వేతసౌధం తెలిపింది. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని బైడెన్ పేర్కొన్నట్లు వెల్లడించింది. దౌత్యపరంగా చర్యలు చేపట్టేందుకు అమెరికా కట్టుబడి ఉన్నా.. పరిస్థితి దిగజారితే మిత్రదేశాల సహకారంతో మరింత దీటుగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బైడెన్ స్పష్టం చేసినట్లు పేర్కొంది.
అయితే పుతిన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదని అధికారులు వెల్లడించారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడితో పుతిన్..
బైడెన్‌తో ఫోన్‌కాల్‌కు ముందు పుతిన్.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్‌తో సంభాషించారు. ఈ కాల్ ద్వారా పరిస్థితి కాస్త కుదుటపడే దిశగా పురోగతి చెందిందని రష్యా వర్గాలు వెల్లడించాయి. రష్యా డిమాండ్లపై నాటో, అమెరికాల వైఖరి గురించి మేక్రాన్ వద్ద ప్రస్తావిస్తూ పుతిన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పేర్కొన్నాయి. రష్యా ఉక్రేయిన్‌పై దాడి చేయనున్నట్లు వస్తున్న వార్తలపై చర్చ జరిగినట్లు తెలిపాయి. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ.. ఉక్రేయిన్‌పై దాడి గురించి వస్తున్న వార్తలను రష్యా ఖండిస్తూ వస్తోంది.
ఇదీ చూడండి : 'రెండు రోజుల్లో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర'