సంక్షోభం మధ్య.. ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా లేని కరోనా ఉపశమన ప్యాకేజీతో ప్రయోజనం ఉండదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నూతన రెస్క్యూ ప్యాకేజీపై అభ్యంతరం వ్యక్తం చేసిన రిపబ్లికన్ సెనేటర్లతో భేటీ అయిన ఆయన.. ప్యాకేజీలో మార్పులు చేసేందుకు విముఖత చూపించారు.
రిపబ్లికన్ సెనేటర్లు చేసిన ప్రతిపాదనలు.. చాలా అంశాలను విస్మరించేలా ఉన్నాయని బైడెన్ పేర్కొన్నట్లు శ్వేతసౌధ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకి తెలిపారు. వైరస్‌పై పోరులో వెనకడుగు వేసేది లేదని ఆయన స్పష్టం చేసినట్లు చెప్పారు. ప్యాకేజీ విషయంలో కాంగ్రెస్ సైతం అత్యవసరంగా స్పందించాల్సిన అవసరం ఉందని బైడెన్ అభిప్రాయపడినట్టు సాకి పేర్కొన్నారు.
"ఉభయసభల మద్దతుతో రెస్క్యూ ప్లాన్ ఆమోదం పొందుతుందని బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక స్థిరత్వం కోసం తీసుకొచ్చిన ఈ ప్రణాళికను జాగ్రత్తగా రూపొందించినట్లు బైడెన్ తెలిపారు. ఇందులో ఎటువంటి మార్పులు చేసినా.. ప్రస్తుత అవసరాలకు తగినట్టు ఉండదని అధ్యక్షుడు భావిస్తున్నారు."
-జెన్ సాకి, శ్వేతసౌధ ప్రెస్ సెక్రెటరీ.
ఇదీ చదవండి: 1.9 ట్రిలియన్ డాలర్లతో బైడెన్ ఆర్థిక ప్రణాళిక
చర్చలు కొనసాగిస్తాం
నూతన ప్యాకేజీపై ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదని బైడెన్‌తో సమావేశం తర్వాత రిపబ్లికన్ సెనేటర్ సుసాన్ కొలిన్స్ పేర్కొన్నారు. దీనిపై చర్చలు కొనసాగించేందుకు ఇరుపక్షాలు నిర్ణయించినట్లు చెప్పారు. 600 బిలియన్ డాలర్ల కొవిడ్ ప్యాకేజీలో ప్రతిపాదించిన నిబంధనలను బైడెన్‌కు వివరించినట్లు తెలిపారు. అయితే, కరోనా ఉపశమన ప్యాకేజీకి కాంగ్రెస్ ఆమోదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు- ఖండించిన ప్రపంచ దేశాలు