అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడారు జో బైడెన్. విపక్షనేత అలెక్సీ నావల్నీ అరెస్టుపై ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్‌లోని అమెరికన్ సైన్యంపై బౌంటీ(హత్య చేసేందుకు ఇచ్చే నజరానా)లు ప్రకటిస్తున్నట్లు వస్తున్న వార్తలను తప్పుబట్టారు. అమెరికన్లపై జరుగుతున్న సైబర్ దాడులను ఖండించారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వానికి అమెరికా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు, అణ్వాయుధ నియంత్ర ఒప్పందమైన 'న్యూ స్టార్ట్' కాలపరిమితి పొడగించేందుకు అంగీకరించాలని రష్యాను కోరారు.
కాగా, న్యూస్టార్ట్ ఒప్పందాన్ని పొడగించుకున్నట్లు రష్యా ప్రకటించింది. సంబంధిత పత్రాలను అమెరికాతో పంచుకున్నామని తెలిపింది. అధికారిక లాంఛనాలు త్వరలోనే పూర్తవుతాయని పేర్కొంది.
పాలస్తీనాతో సంబంధాలు
మరోవైపు, పాలస్తీనాతో సంబంధాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టనున్నట్లు బైడెన్ ప్రభుత్వం వెల్లడించింది. పాలస్తీనా శరణార్థులకు అందించే సహాయాన్ని పునఃప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు మాజీ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
బైడెన్ నిర్ణయాన్ని అత్యున్నత స్థాయి భద్రతా మండలికి వివరించారు రాయబారి రిచర్డ్ మిల్స్. ప్రజాస్వామ్య, యూదు దేశంగా ఇజ్రాయెల్ భవిష్యత్తు సాఫీగా కొనసాగేందుకు అమెరికా కట్టుబడి ఉందని తెలిపారు. అదేసమయంలో తమ సొంతగడ్డపై గౌరవంగా జీవించాలన్న పాలస్తీనా ప్రజల చట్టబద్ధమైన ఆకాంక్షలను అర్థం చేసుకున్నట్లు చెప్పారు. వీటిని సాధించేందుకు ఇజ్రాయెల్, పాలస్తీనాతో అమెరికా.. విశ్వసనీయమైన చర్చలు జరుపుతుందన్నారు. పాలస్తీనా ప్రజలు, పాలకపక్షంతో సంబంధాలు పునరుద్ధరించడం కూడా ఇందులో భాగమేనని అన్నారు.