మెక్సికో సరిహద్దులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక సరిహద్దు గోడ నిర్మాణాన్ని అధ్యక్షుడు జో బైడెన్ నిలిపివేశారు. వారం రోజుల్లోగా పనులు పూర్తిగా నిలిపివేయాలని ఆదేశిస్తూ.. సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వులపై బుధవారం సంతకం చేశారు.
ట్రంప్.. తన చివరి పర్యటనగా మెక్సికో గోడను సందర్శించారు. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. గతేడాది దాదాపు 720 కిలోమీటర్ల మేరకు గోడ నిర్మాణం విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
జనవరి 15 నాటికి... గోడ నిర్మాణం కోసం కేటాయించిన మొత్తం సొమ్ము 10.8 బిలియన్ డాలర్లలో 6.1 బిలియన్లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఒకవేళ మొత్తం సొమ్ము ఉపయోగించి ఉంటే దాదాపు 664 మైళ్లు(1,069 కిలోమీటర్) మేరకు గోడ నిర్మాణం జరిగేది.
అయితే ట్రంప్ 'గోడ' ఆలోచనకు బైడెన్ వ్యతిరేకం. ఈ నేపథ్యంలో ట్రంప్ చర్యపై ఆగ్రహించిన బైడెన్... నిర్మాణ పనులు నిలిపివేయాలని అన్నారు. సంబంధిత కాంట్రాక్టర్లను ఒప్పించి ఈ డబ్బును వేరే పనులకు ఉపయోగించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో నిర్మాణ పనులు చేపట్టిన ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్... పనుల నిలుపుదలపై సన్నాహాలు చేస్తోంది.
జనవరి 14న గోడ నిర్మాణం కోసం అధనంగా 863 మిలియన్ డాలర్ల నిధిని ఇవ్వబోతున్నట్లు ట్రంప్ కార్యనిర్వహణ బృందం పేర్కొంది. కానీ, అది అమలు చేయలేదు. ఇప్పటికే డిఫెన్స్ శాఖకు సంబధించిన నిధులను గోడ నిర్మాణం కోసం ఉపయోగించారంటూ ట్రంప్ ప్రభుత్వంపై విమర్శలు ఉన్నాయి. దీనిపై జరుగుతోన్న వివాదంపై సుప్రీం కోర్టు వచ్చే నెల తీర్పు ఇవ్వనుంది.
ఇదీ చదవండి: