అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన సతీమణి జిల్ బైడెన్, ఇతర కుటుంబ సభ్యులతో సహా మేరీలాండ్‌లోని అధ్యక్షుడి అధికార విడిది 'కాంప్ డేవిడ్'లో సరదా సమయాన్ని గడిపారు. కాగా ఫిబ్రవరి 15 'ప్రెసిడెంట్ డే' సందర్భంగా తమ తాతయ్యకు బైడెన్ మనుమలు ఓ చక్కటి బహుమతినిచ్చారు. అతి ప్రత్యేకమైన ఆ బహుమతికి సంబంధించిన చిత్రాలను ఆయన మనుమరాలు నవోమీ బైడెన్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఆ చిత్రాలు నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతుండగా.. వాటికి ఆ చిన్నారి పెట్టిన సరదా వ్యాఖ్యలు నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్నాయి, ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. ఇంతకీ ఆ బహుమతి ఏంటంటే..
'అధికారం తలకెక్కొకూడదనే'
"ప్రెసిడెంట్ అయిన ఆయనను ప్రెసిడెంట్ డే సందర్భంగా కాస్త ఆకర్షణీయంగా చేశాం..’" అంటూ వారు బైడెన్‌కు ఓ టోపీని బహూకరించారు. అధ్యక్షుడు ఆ టోపీని పెట్టుకున్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో ట్వీట్ చేశారు. వాటిలో బైడెన్ వెనుకకు తిరిగి ఉన్న ఓ చిత్రంలో ఆయన టోపీపై 'పాప్' (పేలడం) అని ఉంది. దీనికి "ఆయన పదవి, అధికారం ఆయన తలలోకి ఎక్కకూడదనే ఇలా చేశా.." అని నవోమీ పెట్టిన వ్యాఖ్య నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది. బైడెన్, ఆయన మనవల మధ్య ప్రేమానుబంధాన్ని తెలియచేసే ఈ చిత్రాలు ఆకర్షిస్తున్నాయి. అధ్యక్షుడు బైడెన్ కుటుంబ విలువలకిచ్చే ప్రాధాన్యతను పొగుడుతూ, ఎంత అధ్యక్షుడైనా మనవళ్లకు తలొగ్గాల్సిందే అంటూ సరదా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చూడండి: కమల బంధువుకు శ్వేతసౌధం వార్నింగ్!