ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మద్దతు పలికారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరిగిన ఫోన్ సంభాషణలో కాల్పుల విరమణపై తన అభిప్రాయాన్ని వెల్లడించారని శ్వేతసౌధం తెలిపింది. .
తక్షణమే కాల్పుల విరమణను పాటించాలంటూ డెమొక్రాట్ చట్టసభ్యుల నుంచి తీవ్ర ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో శ్వేతసౌధం నుంచి తాజా ప్రకటన రావడం గమనార్హం.
గాజాలోని హమాస్ వర్గాలు- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ దాడుల్లో ఇప్పటి వరకు 200 మందికి పైగా మరణించారు. ఇందులో చాలా మంది పాలస్తీనా ప్రజలే ఉన్నారు.
ఇజ్రాయెల్ మిత్రదేశమైన అమెరికా.. ఈ దాడులను పూర్తిగా ఖండించలేదు. రోజురోజుకూ తీవ్రమవుతున్న ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ 15 దేశాలతో కూడిన ఐరాస భద్రతా మండలి ఉమ్మడి ప్రకటనను సైతం మూడు సార్లు అడ్డుకుంది. అయితే ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్యమార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నట్లు అమెరికా రక్షణ మంత్రి జేక్ సలివన్ చెబుతున్నారు.
38వేల మంది గల్లంతు!
ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గాజాలోని 38 వేల మంది పాలస్తీనా ప్రజలు ఆచూకీ కోల్పోయారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. 2,500కు మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని తెలిపింది. 41 విద్యా సంస్థలు ధ్వంసమయ్యాయని వెల్లడించింది. గాజాలో విద్యుత్ సరఫరా తీవ్రంగా దెబ్బతిందని.. వైద్యం, ఇతర అత్యవసర సేవలకు అంతరాయం కలుగుతోందని తెలిపింది. ఉత్తర గాజాలో 51 వేల మందికి ప్రపంచ ఆహార కార్యక్రమం(డబ్ల్యూపీఓ) అత్యవసర సహకారం అందిస్తోందని వివరించింది.
భారతీయ అమెరికన్ల ర్యాలీ
మరోవైపు, ఇజ్రాయెల్‌కు మద్దతుగా చికాగోలోని భారతీయ అమెరికన్లు ర్యాలీ నిర్వహించారు. హమాస్ వర్గం.. యూదులపై ఉగ్రదాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇజ్రాయెల్ ప్రజలకు తాము సంఘీభావం తెలుపుతున్నట్లు భారతీయ అమెరికన్ నేత డాక్టర్ భరత్ బరాయి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: గాజాపై దాడి- ఖండించిన అంతర్జాతీయ సమాజం