Putin war criminal: ఉక్రెయిన్‌పై దండయాత్రకు ఆదేశాలిచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఓ యుద్ధ నేరస్థుడు అని అన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. శ్వేతసౌధంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"పుతిన్ ఉక్రెయిన్‌లో విధ్వంసం సృష్టిస్తున్నారు. భయంకరమైన దాడులకు పాల్పడుతున్నారు. అపార్ట్మెంట్లు, ప్రసూతి వార్డులు, ఆసుపత్రులపై బాంబుల విసురుతున్నారు. ఇది అత్యంత భయానకం. ఇది దేవుడు భయంకరం. నా వెనుక ఉన్న మా కమాండర్ జనరల్ మిల్లీతో దీని గురించి నేను మాట్లాడుతున్నా. నిన్న రష్యా దళాలు మరియుపొల్‌లోని అతిపెద్ద ఆసుపత్రిలో వందలాది మంది వైద్యులు, రోగులను బందీలుగా ఉంచినట్లు వార్తల్లో చూశాం. ఇవి రష్యా అరాచకాలు. ప్రపంచ కోపంగా చూస్తోంది. ఉక్రెయిన్‌కు మా మద్దతు ఉంటుంది. పుతిన్ భారీ మూల్యం చెల్లించాలనే సంకల్పంతో ప్రపంచం ఐక్యంగా ఉంది. అమెరికా ఈ ప్రయత్నానికి నాయకత్వం వహిస్తోంది. మా మిత్రదేశాలు, భాగస్వాములతో కలిసి ఉక్రెయిన్‌కు భద్రతా, మానవతా సాయాన్ని అందిస్తున్నా. ఇక ముందు కూడా కొనసాగిస్తూనే ఉంటాం. తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు ప్రజలకు ఉంది. పుతిన్ ఉక్రెయిన్‌పై ఎప్పటికీ విజయం సాధించకుండా చూస్తాం. సాయం కావాలని జెలెన్స్కీ చేసిన విజ్ఞప్తికి అమెరికా ప్రజలు సమాధానం ఇస్తున్నారు. ఉక్రెయిన్ తనను తాను రక్షించుకోవడానికి మరిన్ని ఆయుధాలు, పరికరాలు అందిస్తున్నాం.
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
అంతకుముందు ఉక్రెయిన్‌కు మరో800 మిలియన్ డాలర్ల భద్రతా సాయం అందిస్తున్నట్లు బైడెన్ ప్రకటించారు. దీంతో వారం వ్యవధిలోనే ఉక్రెయిన్ ఒక బిలియన్ డాలర్ల సాయం అందించినట్లు అవుతుంది. ఇందులో భాగంగా యుద్ధ విమాన వినాశక వ్యవస్థను ఉక్రెయిన్‌కు చేరవేయనున్నట్లు చెప్పారు. దీనివల్ల రష్యా యుద్ధవిమానాలు, హెలికాప్టర్లను ధ్వంసం చేసి ఉక్రెయిన్ ప్రజలను కాపాడవచ్చన్నారు. అంతేగాక అత్యాధునిక ఆయుధాలు కూడా ఉక్రెయిన్‌కు అందించనున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: మేరియుపొల్ థియేటర్‌పై బాంబుల వర్షం.. భారీగా మృతుల సంఖ్య!