ఎన్నికల పోటీ అంటే ప్రత్యర్థిలో ఏ ఒక్క లోపం ఉన్నా భూతద్దంలో చూపించడానికి అభ్యర్థులు ఊవిళ్లూరుతుంటారు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టవు. అటు అధికార పక్షం సైతం విపక్షాలను మరింత కుంగదీసేందుకు ప్రణాళికలు వేసుకుంటుంది. ఏదైనా విషయంలో ఇరుపక్షాలు ఒకే అభిప్రాయంతో ఉంటాయని ఎవరైనా చెబితే నవ్వుకుంటాం! కానీ అమెరికాలో నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఓ విషయంపై ఇద్దరు పోటీదారులు ఒకే విషయాన్ని దృఢంగా నమ్ముతున్నారు. అది.. దేశప్రయోజనాలో, జాతీయ భద్రత విషయమో కానే కాదు. మరి ఆ విషయం ఏంటి?
ఇదీ చదవండి- ట్రంప్ నిజంగా ఒక ఫూల్: జో బిడెన్
అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్... ఆయన ఎన్నికల ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ మధ్య ఒక విషయంలో అభిప్రాయాలు కుదిరాయి. అదే ఎన్నికల్లో అవినీతి. అవును! అన్ని అంశాల్లో కత్తులు దూసుకునే వీరు ఈ విషయంలో మాత్రం ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలు.. అవినీతితో నిండిపోతాయని ఇరువురు భావిస్తున్నారు. అధికారులు ఓటింగ్ ఎలా నిర్వహిస్తారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
'చాలా దగ్గర్లో ఉన్నాం'
'సాధారణ ఎన్నికల్లో ఇప్పటివరకు జరగని అవినీతి ప్రక్రియకు చాలా దగ్గర్లో ఉన్నాం' అంటూ డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ వ్యాఖ్యానించారు. కరోనా నేపథ్యంలో ముందస్తు ఓటింగ్, మెయిల్-ఇన్ ఓటింగ్ నిర్వహణను పొడిగించే అంశంపై మాట్లాడారు.
'చరిత్రలో ఇదే!'
అటు.. ట్రంప్ సైతం గత కొద్ది రోజులుగా ఇదే స్వరం వినిపిస్తున్నారు. మెయిల్-ఇన్ ఓటింగ్ అనేది అమెరికా చరిత్రలోనే అత్యంత అవినీతిమయమైన ఎన్నికలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. మెయిల్ బ్యాలెట్ వల్ల ఓటర్లను మోసం చేసే అవకాశం ఉంటుందని ఇప్పటికే ట్విట్టర్లో ఆరోపించారు ట్రంప్. ఈ విషయంలో ట్విట్టర్ సంస్థ జోక్యం చేసుకుంది కూడా. మెయిల్ ఓటింగ్ గురించి ట్రంప్ చేసిన ట్వీట్‌కు 'ఫ్యాక్ట్ చెక్' జతచేసింది.
ఇదీ చదవండి- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, బిడెన్ మధ్యే పోటీ!
అమెరికా స్థానిక ఎన్నికల్లో ఇలాంటి ఓటింగ్ మోసాలు జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ రాష్ట్ర, దేశవ్యాప్తంగా భారీ ఎత్తున జరిగే ఎన్నికల్లో మాత్రం ఇలాంటి దాఖలాలు లేవు.
మార్చిలో ఫ్లోరిడాలో జరిగిన రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ సైతం మెయిల్ బ్యాలెట్ ఉపయోగించుకున్న విషయాన్ని బైడెన్ ప్రస్తావించారు. ఇవన్నీ పక్కనబెడితే... మెయిల్ ఓటింగ్ సహా ఎన్నికల భద్రత విషయంలో దీర్ఘకాలంగా పక్షపాతం రాజ్యమేలడం గురించి ఇద్దరు నేతలు ప్రధానంగా నొక్కిచెబుతున్నారు.
అణచివేస్తున్నారా?
మరోవైపు బ్యాలెట్ ఓటింగ్‌ను సజావుగా నిర్వహించేందుకు రిపబ్లికన్లు దేశవ్యాప్తంగా ఓటరు జాబితాను కుదిస్తున్నారు. గుర్తింపు పత్రాలను చూపించాలని కొంత మంది ఓటర్లకు కఠినమైన నియమాలు విధించారు. మరికొందరిని సాక్షులను తీసుకురావాలని కోరుతున్నారు.
మోసాలు నివారించేందుకే ఇలా చేస్తున్నామని రిపబ్లికన్లు చెబుతుండగా... డెమొక్రాట్లు మాత్రం ఇవన్నీ ఓటర్లను అణచివేయడానికి జరుగుతున్న కుట్ర అని ఆరోపిస్తున్నారు.
ఇదే అతిపెద్ద ఆందోళన!
ఈ నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని బైడెన్ పిలుపునిచ్చారు. ఎన్నికల భద్రత సహా ప్రజలకు అవగాహన కల్పించడానికి డెమొక్రటిక్ పార్టీ వందలాది మంది న్యాయవాదులు, వలంటీర్లను ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. అమెరికా పోస్టల్ సర్వీస్‌కు ఫెడరల్ ప్రభుత్వ నిధులు నిలిపివేయాలన్న ట్రంప్ ఆలోచనపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
"ఇప్పుడు నాకున్న అతిపెద్ద ఆందోళన ఇదే. ఇది నాకోసం కాదు. నాకన్నా ముందు ఉన్నవారి కోసం, నా తర్వాత వచ్చే వారి కోసం. ఆయన(ట్రంప్) పోస్ట్ ఆఫీసులకు నిధులు నిలిపివేయాలని మాట్లాడుతున్నారు. మెయిల్-ఇన్ బ్యాలెట్లను అసలు డెలివరీ చేయకుండా చూస్తున్నారు."
-జో బైడెన్, డెమొక్రటిక్ నేత, ట్రంప్ ఎన్నికల ప్రత్యర్థి
కరోనా కారణంగా పోస్టల్ ఏజెన్సీలు ఇప్పటికే ఆర్థికంగా కుదేలయ్యాయి. ఓవైపు.. వాటి సహాయార్థం ప్యాకేజీ ప్రకటించాలని కాంగ్రెస్ కోరుతోంది. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది మొదట్లోనే ఒక ఉద్దీపన ప్యాకేజీని అడ్డుకుంది. ఈ నేపథ్యంలో నవంబర్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని గుర్తించి ముందే తప్పుడు ప్రణాళికలు రచిస్తున్నారని బైడెన్ ఆ సమయంలో ఆరోపించారు. ఈ ఆరోపణలకు తగిన ఆధారాలేవీ బైడెన్ ఇవ్వకున్నా.. ఎన్నికలను వాయిదా వేసేందుకు ట్రంప్ తీవ్రంగా పరిశీలిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఓటింగ్ యాక్సెస్‌ను పరిమితం చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న శాసనకర్తల నుంచి పదుల సంఖ్యలో ప్రతిపాదనలు వస్తున్నట్లు బైడెన్ వెల్లడించారు.
ఇదీ చదవండి- కంచుకోటల్లో ఎదురుగాలి- ట్రంప్‌కు ఓటమి తప్పదా?