2008 ముంబయి పేలుళ్ల కేసుతో సంబంధం ఉన్న పాకిస్థాన్ సంతతి కెనడా వ్యాపారవేత్త తహవ్వుర్ రానాను అప్పగించాలన్న భారతదేశ అభ్యర్థనను ధ్రువీకరించాలని న్యాయస్థానాన్ని జో బైడెన్ సర్కారు కోరింది. ఈ మేరకు అసిస్టెంట్ యూఎస్ అటార్నీ జాన్ జే లులేజియాన్.. లాస్ఏంజిల్స్ కోర్టులో 61 పేజీల పత్రాలను సమర్పించారు. ఈ విషయం ఏప్రిల్ 22న కోర్టు విచారణకు రానుంది.
రానా అప్పగింత కోసం అన్ని ప్రమాణాలు సంతృప్తికరంగానే ఉన్నాయని లులేజియాన్ స్పష్టం చేశారు. నిందితుడిపై దర్యాప్తు చేసేందుకు భారత్ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు.
పాకిస్థాన్ సంతతి అమెరికా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీకి.. రానా చిన్ననాటి మిత్రుడు. ముంబయి పేలుళ్ల కేసులో భారత అభ్యర్థన మేరకు జూన్ 10న అతడ్ని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. భారత్-అమెరికా నేరస్థుల అప్పగింత ఒప్పందం ప్రకారం.. రానాను తమకు అప్పగించాలని భారత్ కోరింది. దీంతో ఈ ప్రక్రియను వేగవంతం చేసింది అగ్రరాజ్యం.
ఇదీ చదవండి: రోహింగ్యా శిబిరాల్లో భారీ అగ్ని ప్రమాదం