భారత్-అమెరికా మైత్రిని బలోపేతం చేసేందుకు అధ్యక్షుడు జో బైడెన్ బృందం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అగ్రరాజ్య రక్షణ విభాగం 'పెంటగాన్' పేర్కొంది. అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ జే ఆస్టిన్, భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మధ్య ఫోన్ సంభాషణ జరిగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది పెంటగాన్.
"ఇరు దేశాల రక్షణ మంత్రులు అనేక విషయాలు చర్చించారు. కరోనా కట్టడిలో ఇరు దేశాలు చేపట్టిన చర్యల గురించి మాట్లాడారు." అని పెంటగాన్ మీడియా ప్రతినిధి జాన్ కిర్బీ వివరించారు. రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా పరస్పరం సహాయం చేసుకోవాల్సిన అవసరాన్ని ఇరు దేశాల రక్షణ మంత్రులు చర్చించారని తెలిపారు.
గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య ఒప్పందాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో రక్షణ రంగంలో భారత్ తమ అతిపెద్ద భాగస్వామి అని అమెరికా 2016లో ప్రకటించింది.