ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఓ వృద్ధుడు శాలువా కప్పుకొని, చేతులు ముడుచుకొని కుర్చీపై కూర్చున్న ఫొటో చూశారా? కచ్చితంగా చూసే ఉంటారు! ఎందుకంటే అంతలా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది ఆయన ఫొటో. దానిపై వచ్చిన మీమ్స్‌కు అయితే లెక్కే లేదు. బాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం ఈ మీమ్ ఫీస్ట్‌లో భాగమైపోయారు.
అయితే ఇంతకీ ఆ వృద్ధుడు ఎవరో తెలుసా? ఆయన పేరు బెర్నీ శాండర్స్. అమెరికాలోని వెర్మాంట్ రాష్ట్రానికి సెనేటర్. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణస్వీకారానికి హాజరైనప్పుడు తీసిన ఫొటోనే ఇంతలా వైరల్ అయింది. ఆయన ధరించిన దుస్తులకూ క్రేజ్ ఏర్పడింది. కానీ, ఇదంతా ఇప్పుడెందుకంటారా? ఎందుకంటే ఈ మీమ్స్ ఏకంగా 1.8 మిలియన్ డాలర్లను(దాదాపు రూ.13 కోట్లు) రాబట్టాయి. ప్రమాణస్వీకారం నాటి ఫొటోను ముద్రించిన దుస్తుల అమ్మకాల రూపంలో ఈ డబ్బులు సమీకరించారు. గత ఐదు రోజుల్లో వెర్మాంట్‌లోని వివిధ ఛారిటబుల్ సంస్థలకు ఈ నగదు అందినట్లు బెర్నీ శాండర్స్ స్వయంగా వెల్లడించారు.
"గత వారం రోజులుగా చాలా మంది చూపించిన సృజనాత్మకతకు నేను, జేన్(భార్య) ముగ్ధులయ్యాం. ఇంటర్నెట్ ద్వారా వచ్చిన ఈ ఫేమ్‌ను సహాయం కోసం ఎదురుచూస్తున్నవారి కోసం ఉపయోగించుకున్నందుకు ఆనందిస్తున్నాం. ఈ డబ్బు కాంగ్రెస్(అమెరికా పార్లమెంట్) ఇచ్చే నిధులకు ప్రత్యామ్నాయం కాదు. ఇకపైనా వెర్మాంట్ ప్రజలకు నాకు చేతనైనంత సహకారం చేస్తాను."
-బెర్నీ శాండర్స్ ప్రకటన
మీమ్స్లోని శాండర్స్ వేషధారణకు దక్కిన పాపులారిటీతో ఇతర ఛారిటబుల్ ట్రస్టులు సైతం విరాళాల సేకరణ చేపడుతున్నాయి. ఓ సంస్థ ఇలాంటి శాండర్స్ బొమ్మను వేలం వేసి.. నిధులు సమీకరించింది. మరోవైపు, ఆన్లైన్ మీడియా కంపెనీ 'గెటీ ఇమేజెస్' సైతం ఈ కార్యక్రమంలో భాగమవుతోంది. లైసెన్సింగ్‌తో వచ్చిన నగదులో కొంత భాగాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.