అమెరికా రక్షణ శాఖ మంత్రిగా తొలిసారి నల్లజాతీయుడు లాయిడ్ జే ఆస్టిన్ నియమితులయ్యారు. 93-2 ఓట్ల తేడాతో సెనెట్ ఆయన నియామకాన్ని ఆమోదించింది. వెస్ట్ పాయింట్ గ్రాడ్యుయేట్ అయిన లాయిడ్.. జాతిపరమైన అడ్డంకులను అధిగమించి అమెరికా సైన్యంలో ఉన్నతస్థాయి పదవులు చేపట్టారు. అమెరికా సైన్యంలో 4 దశాబ్దాలకుపైగా ఆయన అందించిన సేవలను గుర్తించిన అధ్యక్షుడు జో బైడెన్.. ఆయనకు రక్షణ మంత్రి బాధ్యతలు కట్టబెట్టారు.
జనరల్ లాయిడ్ ఆస్టిన్ అమెరికా సైన్యంలో నాలుగు దశాబ్దాలకుపైగా సేవలందించారు. అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ హోదాలో 2016లో పదవీ విరమణ చేశారు. ఇరాక్, సిరియాల్లో ఇస్లామిక్ స్టేట్‌ను వ్యతిరేకంగా అమెరికా సైనిక వ్యూహాన్ని అమలు చేయటంలో కీలకపాత్ర పోషించారు. సైనికాధికారిగా పదవీ విరమణ చేసిన వ్యక్తి.. ఏడేళ్ల తర్వాతనే రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఆయన పదవీ విరమణ చేసి 4 సంవత్సరాలే పూర్తి అయినప్పటికీ.. ప్రత్యేక మినహాయింపు పొందారు. ఇలా ప్రత్యేక మినహాయింపు ద్వారా రక్షణ మంత్రి పదవి పొందిన మూడో వ్యక్తిగా లాయిడ్ నిలిచారు. ఆయనకన్నా ముందు 1950లో జార్జ్‌మార్షల్, 2016లో జేమ్స్ మాటిస్ ఈ విధంగా రక్షణ శాఖ మంత్రి పదవి పొందారు.
ఇదీ చూడండి:వైట్‌హౌస్‌కు 'కొత్త' రూల్స్- పక్కాగా అమలు