శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోయే కొద్దీ కరోనా విజృంభణ అధికంగా ఉంటుందని ఓ అధ్యయనం హెచ్చరిస్తోంది. ఉపరితలంపై ఉన్న వైరస్‌పై వాతావరణ కారకాలు ఏ విధమైన ప్రభావం చూపుతాయో తెలుసుకునేందుకు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. అమెరికాలోని యుటా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు.
వైరస్‌ను పోలిన అణువులతో...
వైరస్‌ను పోలిన అణువుల(పీఎల్వీ)ను ఈ పరిశోధన కోసం వినియోగించారు. వీటి నిర్మాణం సరిగ్గా కొవిడ్ బాహ్య ఆకృతి లక్షణాలను పోలి ఉంటుందని జీవరసాయన, జీవ భౌతిక పరిశోధన సమాచారం అనే జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. కరోనాలోని కొవ్వు, మాంసకృత్తుల ఆధారంగా పీఎల్వీలను రూపొందించారు.
గాజు ఉపరితలంపైన పొడి, తేమ పరిస్థితుల్లో ఉష్ణోగ్రతల్లో మార్పులు జరగడం వల్ల వైరస్ ఎంత కాలం జీవంతో ఉంటుందో అంచనా వేశారు అధ్యయనకర్తలు. సాధారణంగా కరోనా రోగి తుమ్మడం, చీదడం, దగ్గడం వల్ల వెలువడే తుంపర్ల ద్వారా వైరస్ ఇతరులకు సోకుతుంది. ఈ తుంపర్లు ఎక్కువ దూరం ప్రయాణించినప్పటికీ త్వరగా ఆవిరైపోతాయి.
పరిశోధన ఇలా..
వీఎల్పీ అణువులను ద్రవరూప బఫర్ రసాయనంలో, పొడి ఉపరితలంపై ఉంచి ఉష్ణోగ్రతల్లో మార్పులు చేశారు పరిశోధకులు. రెండు స్థితుల్లోనూ ఉష్ణోగ్రతను 34డిగ్రీలకు పెంచి, అరగంట పాటు ఉంచడం ద్వారా కణాల బాహ్య ఆకృతి పట్టు కోల్పోయినట్లు తేలింది. ఈ ప్రభావం ద్రవ కణాల కన్నా పొడి రేణువులపై అధికంగా ఉన్నట్లు వెల్లడైంది.
సాధారణ ఉష్ణోగ్రత లేదా చలిగా ఉన్నప్పుడు వైరస్ జీవిత కాలం అధికంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. తుంపర్లలో వైరస్ కణాలు ప్రయాణించే దూరాన్ని తేమ ప్రభావితం చేసినా... దాని మనుగడపై చాలా తక్కువ ప్రాబల్యం చూపుతున్నట్లు నిర్ధరించారు.
అధిక ఉష్ణోగ్రతలు అవసరం లేదు..
కరోనా నివారణకు ప్రతీ కణాన్ని విడిగా జయించాల్సి ఉంటుందని యుటా విశ్వవిద్యాలయ సహ అధ్యయనకర్త మైఖేల్ వెర్షినిన్ అన్నారు. రేణువులను చంపడానికి వేడి వాతవరణం అవసరం లేదని వెచ్చగా ఉంటే సరిపోతుందని చెప్పారు. ఉష్ణోగ్రతలకు వైరస్ కణాలు త్వరగా చలిస్తాయని వెల్లడించారు.
ఇదీ చూడండి: కొవిడ్‌తో మరణ ముప్పు ఐదు రెట్లు అధికం