మీరు ఉద్యోగార్థులా.. వివాదస్పదమైన, మరీ వ్యక్తిగతమైన అంశాలు ఫేస్బుక్లో పోస్ట్ చేశారా.. అయితే జాగ్రత్త వహించండి. మీ అర్హతలు, నైపుణ్యాలతో పాటు మీరు ఉద్యోగం వచ్చే అవకాశాన్ని ఫేస్బుక్ కూడా నిర్ధరించనుంది. ఈ మేరకు అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్ర విశ్వవిద్యాలయ పరిశోధకుల పరిశోధనలో తేలింది. మరీ వ్యక్తిగతమైన, వివాదస్పదమైన అంశాల్లో కచ్చితమైన అభిప్రాయాల కారణంగా మీ ఉద్యోగ దరఖాస్తు తిరస్కరణకు గురికావొచ్చంటూ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సెలక్షన్, అసెస్‌మెంట్ అనే పత్రికలో ఈ మేరకు తమ పరిశోధనలోని అంశాలను బహిర్గతం చేసింది వర్సిటీ. సోషల్ మీడియాలో వ్యక్తిగత ప్రమేయం ఎక్కువగా ఉన్నవారు, కచ్చితమైన అభిప్రాయాలను వ్యక్తం చేసిన వారి పట్ల ఉద్యోగ సంస్థలు తక్కువ ఆసక్తి చూపుతున్నాయని తేల్చింది.
మద్యపానం పోస్టులపైనా..
మద్యపానం, మాదకద్రవ్యాలకు అనుకూల పోస్టులు చేసేవారిపైనా ఉద్యోగమిచ్చే అంశమై సంస్థలు ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు పరిశోధకులు. మేనేజర్లుగా తీసుకునే సమయంలో మరీ వ్యక్తిగతమైన అంశాలు, కచ్చితమైన అభిప్రాయాలు, మద్యం-మాదకద్రవ్యాలకు అనుకూల పోస్టుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేసిందీ పరిశోధనా సంస్థ.
సామాజిక మాధ్యమాల్లో ఇలా ప్రతికూల సమాచారాన్ని వ్యాప్తి చేసేవారిపై ప్రతికూల ప్రభావం ఉంటుందని.. ఇలాంటి చిన్న అంశమే పెద్ద నష్టం కలిగిస్తుందని పెన్సిలేన్వియా వర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న మైఖేల్ ట్యూస్ వెల్లడించారు. ఉద్యోగం కోసం అప్లై చేసుకునేవారెవరైనా ఈ అంశాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదన్న పరిశోధకులు.. సామాజిక మాధ్యమాల్లో అలాంటి అంశాలను పంచుకోకపోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: మద్యం ఊరికే రాదు... మరి ఇలా కుళాయిల్లో వస్తే.!