ప్రపంచమంతటా ఆసక్తి రేకెత్తించే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అగ్రరాజ్యాధినేత ఎవరో నిర్ణయించే ఎన్నికలు మరో 100 రోజుల్లో (నవంబరు 3న) జరగనున్నాయి. ఇందులో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. డెమోక్రాట్ల అభ్యర్థి జో బైడెన్‌తో అమీతుమీ తేల్చుకోనున్నారు. వారి విజయావకాశాలపై ఇప్పటికే భారీయెత్తున విశ్లేషణలు వెలువడుతున్నాయి.
కరోనా, ఆర్థిక వ్యవస్థ
తాజాగా ది అసోసియేటెడ్‌ప్రెస్, ఎన్‌వోఆర్‌సీ సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ ఓ సర్వేను నిర్వహించగా.. అమెరికాలో కొవిడ్ విజృంభణ ట్రంప్‌నకు ప్రతికూలంగా మారుతున్నట్లు తేలింది. కరోనా కట్టడి కోసం ఆయన అనుసరిస్తున్న వ్యూహానికి కేవలం 32 శాతం అమెరికన్లే మద్దతు పలుకుతున్నారని సర్వే నిర్ధారించింది. ఆర్థిక వ్యవస్థ పతనం కూడా ట్రంప్‌నకు ఈ ఎన్నికల్లో ప్రతిబంధకంగా మారే అవకాశముందని తెలిపింది.
సరైన దిశలో లేదు
ఆర్థిక వ్యవస్థను ఆయన నడిపించిన తీరుపై ఎక్కువ మంది కొన్ని నెలల క్రితం వరకు సంతృప్తిగానే ఉన్నారని.. ఇప్పుడు మాత్రం వారి శాతం గణనీయంగా తగ్గిందని సర్వే వెల్లడించింది. ట్రంప్ సారథ్యంలో ప్రస్తుతం దేశం సరైన దిశలో వెళ్లడం లేదని ప్రతి 10 మంది అమెరికన్లలో 8 మంది అభిప్రాయపడుతున్నట్లు సర్వే తేల్చడం గమనార్హం.