అమెరికాకు చెందిన మరో సంస్థ కొవిడ్-19కు ఆర్‌ఎన్‌ఏ టీకాను అభివృద్ధి చేసింది. ఇది కరోనా వైరస్‌ను నిర్వీర్యం చేసే యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తోందని తెలిపారు. ఎలుకలు, వానరాల్లో దీన్ని విజయవంతంగా పరీక్షించి చూశారు. ఒక్క టీకాతోనే మంచి ఫలితం వచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిశోధన బృందంలో భారత సంతతికి చెందిన అమిత్ ఖాందార్ కూడా ఉన్నారు.
రెండు వారాల్లోనే ప్రభావం..
పీఏఐ లైఫ్ సైన్సెస్ సంస్థ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. జంతువుల్లో కండరాల ద్వారా దీన్ని ఇచ్చినప్పుడు రెండు వారాల్లోనే ప్రభావం చూపడం మొదలుపెట్టిందని శాస్త్రవ్తేతలు తెలిపారు. ఈ క్రమంలో ఉత్పత్తయిన యాంటీబాడీలు.. కొవిడ్-19 నుంచి కోలుకున్న బాధితుల్లోని యాంటీబాడీలతో సరిపోలాయని చెప్పారు. ఈ తరహా టీకాలు భారీ పరిమాణంలో ప్రొటీన్లు ఉత్పత్తయ్యేలా చూస్తాయని, వైరస్‌ను గుర్తించే ఒత్తిడి ప్రతిస్పందన వ్యవస్థను ప్రేరేపిస్తాయని తెలిపారు. ఈ వ్యవస్థ.. మిగతా రోగ నిరోధక వ్యవస్థను క్రియాశీలం చేస్తుందని వివరించారు.
ప్రత్యేక లక్షణాలతో..
ఈ ఆర్‌ఎన్‌ఏ టీకాను కొవిడ్-19 కారక కరోనా వైరస్ జన్యు క్రమం ఆధారంగా తయారు చేశారు. ఈ వ్యాక్సిన్.. కణాల్లోకి ప్రవేశించాక ప్రత్యేక ప్రొటీన్లను ఉత్పత్తి చేయాలని సూచనలు జారీ చేస్తుంది. ఈ ప్రొటీన్లు కరోనా వైరస్‌ను గుర్తించి, యాంటీ బాడీలు, టి కణాలతో వాటిపై దాడి చేసేలా శరీరానికి తర్ఫీదు ఇస్తాయి. దీన్ని మానవులపై ప్రయోగించడానికి కసరత్తు జరుగుతోంది. ఈ టీకాకున్న ప్రత్యేక లక్షణాల వల్ల తక్కువ డోసులతోనే కరోనా నుంచి రక్షణ లభిస్తుందని పరిశోధకులు చెప్పారు.
ఇదీ చూడండి: కరోనా వ్యాక్సిన్ రేసులో ఏ దేశం ఎక్కడ?