అమెరికా... ప్రపంచ దేశాల ప్రజల కలల రాజ్యం. అమెరికాలో చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని, అక్కడే శాశ్వతంగా ఉండిపోవాలన్నది అనేకమంది లక్ష్యం. ఇందుకు అగ్రరాజ్యంలో ఉండే స్వేచ్ఛ, అక్కడి వసతులు, జీవనశైలి ప్రధాన కారణాలు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థతో ప్రపంచ దేశాలను శాసించే స్థాయికి ఎదిగింది అమెరికా.
అయితే ఇవన్నీ కొన్ని నెలల ముందు వరకు. ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. నిన్నటివరకు కరోనా కేసులు, మరణాలతో అల్లాడిపోయిన అగ్రరాజ్యం.. ఇప్పుడు నల్లజాతీయుడి మరణంతో తీవ్ర సంక్షోభంలోకి జారిపోయింది. రోజురోజుకు పెరుగుతున్న నిరుద్యోగం ప్రజాగ్రహానికి మరో కారణమైంది.
అప్పుడే మొదలైంది...
ఎన్నో నెలలుగా సాగిన వాణిజ్య యుద్ధానికి స్వస్తి పలుకుతూ చైనా-అమెరికా ఈ ఏడాది జనవరిలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అక్కడితో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది.
జనవరి నుంచే నిశ్శబ్దంగా వ్యాప్తి చెందడం మొదలుపెట్టిన ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్.. మార్చి నుంచి అగ్రరాజ్యంలో తన విశ్వరూపాన్ని చూపించడం ప్రారంభించింది. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని కేసులు, మరణాలు అమెరికాలో నమోదయ్యాయి.
లాక్‌డౌన్‌తో అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. న్యూయార్క్ వంటి ప్రముఖ నగరాల్లో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. అమెరికా నిరుద్యోగుల జాబితాలో మరో 4 కోట్ల మంది చేరారు.
ఆ మరణంతో...
అమెరికాలో ఇప్పటికీ వేలల్లో వైరస్ కేసులు, వందల్లో మరణాలు నమోదవుతున్నాయి. కానీ మిన్నెపోలిస్‌లో ఓ నల్లజాతీయుడి మరణంతో నూతన సంక్షోభానికి తెరలేచింది.
మిన్నెపొలిస్‌లో ఫోర్జరీ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. సోమవారం రాత్రి ఆఫ్రికన్ అమెరికన్ జార్జి ఫ్లాయిడ్‌ను అనుమానితుడిగా గుర్తించి విచారించేందుకు వెళ్లారు. సంకెళ్లు వేసి జార్జ్ మెడపై ఓ పోలీసు అధికారి మోకాలు బలంగా ఉంచాడు. ఊపిరి తీసుకోలేక జార్జి ప్రాణాలు కోల్పోయాడు. ఆ పోలీసును అధికారులు అరెస్టు చేశారు.
అప్పటికే ఆరోగ్య- ఆర్థిక సంక్షోభంతో నలిగిపోయిన అమెరికన్లు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేదు. జార్జ్ ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాలంటూ భారీగా రోడ్లపైకి వస్తున్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతమయ్యాయి. అనేక నగరాలు అట్టుడుకుతున్నాయి.
అయితే... ఫ్లాయిడ్ ఒక్కడికే న్యాయం చేస్తే నిరసనలు ఆగుతాయని అనుకుంటే పొరపాటే అంటున్నారు నిపుణులు. మొత్తం క్రిమినల్ న్యాయ వ్యవస్థను సమూలంగా మార్చాలన్నది వారి డిమాండ్‌గా కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు.
"పౌర వ్యవస్థలోని లోపాలు మెల్లగా బయటపడుతున్నాయి. ప్రజలు బయటకు వస్తున్నారు. ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న ప్రజల ఆగ్రహాన్ని పెంచేందుకు చిన్న విషయం చాలు."
-- డౌగ్లస్ బ్రన్క్లే, రైస్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్.
ఈ పరిస్థితులు దేశ చరిత్రనే మార్చేస్తాయని పులువురు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అగ్రరాజ్యంలో పరస్థితులు ఎన్నటికీ సాధారణంగా ఉండవని అంటున్నారు.
"అన్ని విషయాలపై ప్రజలు కోపంతో ఉన్నారు. చరిత్రలో ఎన్నో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. విధ్వంసం జరిగింది. ఇది కూడా అలాంటిదే. కానీ ఈ పరిస్థితులు దేనికి దారి తీస్తాయో వేచి చూడాలి."
-- బార్బరా రన్స్బై, 'మేకింగ్ ఆల్బ్లాక్ లివ్స్ మాటర్' రచయిత.
అధ్యక్ష ఎన్నికల తరుణంలో...
అమెరికాలో ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో ఇంతటి ప్రతికూల వాతావరణం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత ఇబ్బందికరమే. ముఖ్యంగా కరోనా వైరస్‌పై తన తీరుతో ట్రంప్ సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్నారు. వైరస్ విషయంలో చైనాపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. కానీ సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసమే ఈ ఆరోపణలు అని నిపుణులు చెబుతున్నారు. ఈ సంక్షోభానికి నల్లజాతీయుడి మరణం తోడైంది. అగ్రరాజ్యంలో అగ్గి రాజుకుంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించకుండా... ట్రంప్ తన సహజ శైలినే ఈసారీ ప్రదర్శించారు. ఫ్లాయిడ్ మరణానికి మిన్నెపొలిస్ మేయర్( డిమొక్రాట్ )పై నిందారోపణలు చేస్తూ ట్వీట్లు చేశారు. నిరసనకారులను దోపిడీదారులుగా అభివర్ణించారు.
ఇలా అంతకంతకూ తీవ్రమవుతున్న 'అగ్ర సంక్షోభం'... మున్ముందు ఎలాంటి మలుపు తిరుగుతుంది? అమెరికా భవిష్యత్ ఏంటి? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
ఇదీ చూడండి:- కర్కశ మాజీ పోలీసుపై అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు