అమెరికా-తాలిబన్ శాంతి ఒప్పందానికి ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. శాంతి ఒప్పందంలో భాగంగా వేలాది మంది తాలిబన్ ఖైదీలను విడుదల చేయాల్సి ఉంది. అయితే వచ్చే వారం జరగనున్న ఆఫ్గాన్ అధికార భాగస్వామ్య చర్చల కంటే ముందు వారిని విడిచిపెట్టేది లేదని ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ బహిరంగంగానే తేల్చి చెప్పారు.
చెప్పాల్సింది అమెరికా కాదు
తాలిబన్ ఖైదీల విడుదల అనేది అమెరికా చేయగల వాగ్దానం కాదని, ఇది పూర్తిగా తమ ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమని ఘనీ స్పష్టం చేశారు. శాంతి చర్చలు ప్రారంభమయ్యే ముందు ఖైదీలను విడుదల చేయడానికి తాను సిద్ధంగా లేనని ఆయన అన్నారు.
ఒప్పందానికి కట్టుబడి ఉంటే చాలు..
అమెరికా మాత్రం రానున్న 14 నెలల్లో ప్రణాళికాబద్ధంగా తమ సైనిక దళాలను అఫ్గానిస్థాన్ నుంచి ఉపసంహరిస్తామని పేర్కొంది. అయితే ఇదంతా ఉగ్రవాద నిరోధక పనితీరుతో ముడిపడి ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి అఫ్గాన్ అంతర్గత చర్చల పురోగతితో సంబంధం లేదని పేర్కొంది.
శాంతి ఒప్పందం...
గత 18 ఏళ్లుగా అఫ్గానిస్థాన్‌లో కొనసాగుతున్న అశాంతికి ముగింపు పలుకుతూ అమెరికా-తాలిబన్ల మధ్య శనివారం శాంతి ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా 5000 మంది వరకు తాలిబన్ ఖైదీలను అఫ్గాన్ ప్రభుత్వం, 1000 మంది ఖైదీలను తాలిబన్లు విడుదల చేయాలని నిర్ణయించారు.
అయితే మార్చి 10న నార్వే రాజధాని ఓస్లోలో అఫ్గాన్ వర్గాల మధ్య శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయి. తాజాగా అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ చేసిన వ్యాఖ్యలు ఒప్పందం అమలులో మొదటి అడ్డంకిగా నిలిచాయి.
ఇదీ చూడండి: యుద్ధభూమిలో శాంతిస్థాపనే ధ్యేయంగా చారిత్రక ఒప్పందం
ఇదీ చూడండి: అవును.. ప్రధాని గర్ల్‌ఫ్రెండ్ తల్లికాబోతోందట!