ఎర్ర రక్తకణాల్లో (ఎరిథ్రోసైట్ల)ని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు మరణం ముప్పును అంచనావేసే అద్భుత సూచికలని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. రక్తంలో వీటి స్థాయి అధికంగా ఉంటే ఆయుర్దాయం కనీసం ఐదేళ్ల మేర పెరుగుతుందని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆహారంలో చేపలను తీసుకుంటే ఈ ఆమ్లాల స్థాయి పెరుగుతుందని తెలిపారు. నిత్యం ధూమపానం చేసే వ్యక్తి ఆయుర్దాయం 4.7 ఏళ్లు తరిగిపోతుందని చెప్పారు. అమెరికాలోని మస్సాచుసెట్స్ పట్టణంలో 65 ఏళ్లు పైబడ్డ 2,240 మందిపై 11 ఏళ్ల పాటు పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఈ మేరకు తేల్చారు.
ఒమేగా-3 సహా నాలుగు రకాల ఫ్యాటీ ఆమ్లాలు మనిషి ఆయుర్దాయాన్ని నిర్ధరించగలవని పరిశోధకులు గుర్తించారు. అయితే సాధారణంగా గుండె జబ్బులతో ముడిపడిన శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు కూడా వీటిలో ఉండటం శాస్త్రవేత్తల్లో ఆశ్చర్యాన్ని కలిగించాయి. దీన్నిబట్టి శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలన్నీ హాని కలిగించేవి కావని స్పష్టమవుతున్నట్లు పరిశోధనలో పాల్గొన్న అలిక్స్ శాలా-విలా పేర్కొన్నారు.
"ఒక వ్యక్తి రక్తంలోని భిన్న రకాల ఫ్యాటీ ఆమ్లాల స్థాయిని బట్టి ఆ వ్యక్తికే ప్రత్యేకమైన ఆహార సూచనలు చేయడానికి ఈ పరిశోధన వీలు కల్పిస్తుంది. ఆహారంలో చిన్నపాటి మార్పుల ద్వారా మనం ఊహించినదాని కన్నా ఎక్కువ ప్రయోజనాన్నే పొందొచ్చు. ధూమపానాన్ని మానేయడం వల్ల అకాల మరణం ముప్పు ఎంతమేర తగ్గుతుందో.. ఒమేగా-3 ఆమ్లాలు ఒక్క శాతం పెరిగినా అంతమేర ప్రయోజనం ఉంటుంది."
-అలిక్స్ శాలా-విలా, పరిశోధనకర్త
ఇదీ చూడండి: