మీటూ ప్రకంపనలకు కారణమైన హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్‌స్టీన్ కేసు విచారణ అమెరికా మన్హటన్ కోర్టులో జరుగుతోంది. ప్రధాన ఫిర్యాదుదారుల్లో ఒకరైన మిమి హాలేయీ తనకు జరిగిన ఘోరాన్ని కోర్టుకు వివరించి కన్నీరు పెట్టుకుంది.
వైన్‌స్టీన్ సంస్థలో ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా పనిచేసినప్పుడు 2006 జులైలో ఈ దారుణానికి ఒడిగట్టాడని ఆరోపించింది మిమి. తను రుతుక్రమంలో ఉన్న సమయంలో వైన్‌స్టీన్ న్యూయార్క్ ఇంటిలోని పిల్లల గదిలో లైంగికంగా వేధించాడని కోర్టుకు తెలిపింది.
"నాకన్నా 3 రెట్లు ఎక్కువ బరువు ఉండేవాడు వైన్‌స్టీన్. మొదటగా స్నేహపూర్వకంగా మెలిగేవాడు. ఓ రోజు తన ఇంటిలోని పిల్లల గదికి తీసుకెళ్లాడు. అకస్మాత్తుగా నన్ను పట్టుకుని ముద్దు ఇచ్చాడు. వద్దని ఎంతో ప్రాధేయపడ్డాను.
బలవంతంగా నన్ను మంచంపైకి నెట్టాడు. నోటితో స్పర్శించాడు. అక్కడనుంచి బయటపడేందుకు ఎంతో ప్రయత్నించాను. కానీ సాధ్యం కాలేదు."
-మిమి హలేయీ
ఫిన్లాండ్కు చెందిన హలేయీ.. ఇన్ని రోజులు ఎందుకు ఈ విషయాన్ని దాచిందో వివరించారు. చెల్లుబాటయ్యే వర్క్‌వీసా లేకపోతే అమెరికాలో ఉన్న తనకు బహిష్కరణ తప్పదనే భయంతో ఇన్ని రోజులు ఘటనపై ఫిర్యాదు చేయలేదన్నారు. ఆ సమయంలో పోలీసుల వద్దకు వెళ్లే అవకాశం తనకు లేదని తెలిపింది. వైన్‌స్టీన్‌కు డబ్బు, పలుకుబడి ఉండటం వల్ల వెనకడుగు వేశానని చెప్పింది హలేయీ.
అయితే విచారణలో భాగంగా హలేయీ ఆరోపణలను అటార్నీ డామన్ కెరానిస్ సవాలు చేశారు. అత్యాచారం నిజమే అయితే రెండేళ్ల క్రితం హార్వేకు స్నేహపూర్వకంగా సందేశం ఎలా పంపారని ప్రశ్నించారు.
ఎన్నో ఆరోపణలు..
వైన్‌స్టీన్‌పై సుమారు 80 మంది మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఇందులో ప్రముఖ హాలీవుడ్ కథానాయికలు కూడా ఉన్నారు. అయితే వైన్‌స్టీన్‌పై ఇద్దరికి సంబంధించిన ఫిర్యాదులను నమోదయ్యాయి. అందులో హలేయీతోపాటు నటి జెస్సికా మాన్ ఉన్నారు. 2013లో వైన్‌స్టీన్ తనను అత్యాచారం చేశాడని జెస్సికా ఫిర్యాదు చేసింది. ఈ కేసులు రుజువైతే వైన్‌స్టీన్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశముంది.
వైన్‌స్టీన్ మాత్రం తన లైంగిక సంబంధాలన్నీ పరస్పర అంగీకారంతో ఉన్నవేనని స్పష్టం చేశాడు.
వైన్‌స్టీన్ అకృత్యాలు బయటపడిన నేపథ్యంలో మీటూ ఉద్యమానికి పునాది పడింది. లక్షలాది మంది మహిళలు తమ జీవితంలో ఎదురైన దాడుల గురించి బహిర్గతం చేశారు.