కొవిడ్-19 యాంటీబాడీలను అత్యంత కచ్చితత్వంతో గుర్తించే విశ్వసనీయ పరీక్షా విధానాన్ని రూపొందించారు శాస్త్రవేత్తలు. దీని ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే ఫలితాన్ని తెలుసుకోవచ్చు.
'బ్లి-ఇసా' విధానంతో..
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం చేపట్టిన ఈ పరిశోధన వివరాలను సైంటిఫిక్ రిపోర్ట్స్ పత్రిక వెల్లడించింది. ఎలీసా విధానంలో సెరొలాజికల్ ఎస్సేగా పిలిచే యాంటీబాడీ పరీక్ష ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీని ద్వారా రోగ నిరోధక శక్తి ప్రతిస్పందన మాత్రమే తెలుస్తుంది. ఫలితం కోసం 4 నుంచి 6 గంటల సమయం నిరీక్షించాలి. వర్సిటీ పరిశోధకులు బ్లి-ఇసా(బయో లేయర్ ఇంటర్ఫెరోమెట్రి- ఇమ్యునో సోర్బెంట్ ఎస్సే) అనే సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు.
శరీరంలో యాంటీబాడీలు అత్యంత తక్కువ మోతాదులో ఉన్నా ఈ ఎస్సే గుర్తిస్తుందని, తప్పుడు ఫలితం వచ్చే ఆస్కారం చాలా తక్కువేనని పరిశోధనాకర్త రెబెక్కా డుబోయిస్ పేర్కొన్నారు.
"టెస్ట్ స్ట్రిప్స్ క్వాంటిటేటివ్ ప్రయోజనాలనూ, ఎలీసా పనితీరునూ మేళవించి బ్లి-ఇసాను రూపొందించాం. అత్యంత తక్కువ స్థాయిలో కొవిడ్ యాంటీబాడీలు ఉన్నా, కొత్త పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్ఫెక్షన్ల ద్వారా అవి ఏర్పడ్డాయా? లేక వ్యాక్సినేషన్ వల్ల వచ్చాయా? అన్నది కూడా తెలుస్తుంది."
- పరిశోధకులు
ఇదీ చదవండి: జన భాగస్వామ్యంతోనే పోరు- అవగాహనతోనే ఆరోగ్యం