కరోనాతో కనీస నిత్యవసరాల ధర కూడా కొండెక్కి కూర్చుంది. కానీ మహమ్మారికి ముందు కూడా 300 కోట్ల మంది ఆరోగ్యకరమైన ఆహారానికి దూరంగానే ఉన్నారు. 2017 నాటి డేటా ప్రకారం ప్రపంచంలోని 40 శాతం జనాభాకు నాణ్యతలేని ఆహారమే గత్యంతరంగా మారింది. అధిక ఆహార ధరలు, తక్కువ ఆదాయాలు ఇందుకు ప్రధాన కారణం. నాణ్యమైన ఆహార పదార్థాలు తక్కువ ధరకు లభించడమే గగనమైపోయింది. రోజుకు రెండు పూటల తిండికే అనేక మంది ప్రజలు అవస్థలు పడుతున్న పరిస్థితుల్లో పోషకాహార లోపాన్ని తరిమికొట్టడం ఎంతవరకు సాధ్యమనేది ప్రశ్నార్థకమవుతోంది.
మరి మిగిలిన 60 శాతం జనాభా అయినా పూర్తిగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నారా? అంటే అదీ లేదు. హెల్తీ మీల్స్‌కు అవసరమైన పదార్థాలను కొనుగోలు చేసే స్తోమత వీరి వద్ద ఉన్నా.. వివిధ ప్రకటనలను చూసి చాలా మంది అనారోగ్యకరమైన పదార్థాలనే చివరకు ఎంపిక చేసుకుంటున్నారు.
యూనివర్సిటీ ప్రాజెక్టు
దీన్ని బట్టి పోషకాహారం తీసుకోకపోవడానికి స్తోమతతో పాటు ఇతర కారణాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. కొంత మంది వద్ద తగిన డబ్బు ఉన్నా.. సరైన పోషకాహారం తీసుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా మసాచుసెట్స్‌లోని టఫ్ట్స్ యూనివర్సిటీ 'పోషకాహార ధరలు'(Food Prices for Nutrition) అనే ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలంటే అయ్యే ఖర్చును లెక్కించేందుకు ప్రపంచ బ్యాంకు, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సమన్వయంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టింది.
"ప్రపంచ బ్యాంకు డేటాను ఉపయోగించి 174 దేశాల్లో 800 ఆహార పదార్థాల ధరలను లెక్కించాం. ఆహార పదార్థాల రేట్లతో పాటు వాటిలో ఉండే పోషక విలువలను గణించాం. అవసరమైన పోషకాలు అతి తక్కువ ధరలో ఎలా తీసుకోవాలో గుర్తించాం. వివిధ దేశాల్లోని ప్రజలు ఆహారం కోసం ఎంత మొత్తం వెచ్చిస్తున్నారనే గణాంకాలతో వీటిని పోల్చి చూశాం. అమెరికాలోని అందరూ పోషకాహారం తీసుకునే స్తోమత కలిగి ఉన్నారని ఇందులో తేలింది. కానీ, ఆఫ్రికా, దక్షిణాసియా వంటి ప్రాంతాల్లో ప్రజలు తమ ఆదాయాన్నంతటినీ వెచ్చించినా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను కొనుగోలు చేయడం కష్టమే."
-విలియం ఏ మాస్టర్స్, అన్నా హెర్ఫోర్త్, టఫ్ట్స్ యూనివర్సిటీ
ఆహార పదార్థాల ధరల్లో హెచ్చుతగ్గులు సహజమే. కానీ చేపలు, పప్పు గింజలు, కూరగాయలు, పండ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల ధరలు.. దుంపలతో పోలిస్తే ఎక్కువగానే ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారానికి అధిక వ్యయం చేయాల్సి వస్తున్నందున చాలా మంది చౌకగా లభించే సాధారణ పదార్థాలనే కొనుగోలు చేస్తున్నారు. ఇంకొందరైతే అర్ధాకలితోనే ఉంటున్నారు.
మరి ఏం చెయ్యొచ్చు?
అల్పాదాయ వర్గాలకు సామాజిక రక్షణ కల్పించడం, ఎక్కువ వేతనం ఉన్న ఉద్యోగాలను సృష్టించడం ద్వారా పోషకాహార లోపాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఇలాంటి చర్యలు అన్ని దేశాలు చేపట్టాలి. ఉదాహరణకు అమెరికాలో సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తున్నారు. అల్పాదాయ వర్గాల ప్రజలు తమకు కావాల్సిన ఆహార పదార్థాలను కొనుగోలు చేయడానికి ఈ పథకం తోడ్పాటు అందిస్తుంది. తద్వారా ఆహార అసమానతలు తగ్గుతాయి. ముఖ్యంగా చిన్నారుల పోషణ, అభివృద్ధికి వీలు కలుగుతుంది.
ప్రభుత్వాలు నేరుగా సహకారం అందించడమే కాకుండా పరోక్షంగానూ ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరగాలి. ఆహార పదార్థాల ధరలను తగ్గించేందుకు కృషి చేయాలి. ఆహార ఉత్పత్తి, పంపిణీని మెరుగుపర్చేందుకు నూతన సాంకేతికత, మౌలిక సదుపాయాల్లో ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టాలి. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు పెరగాలి. తద్వారా ఆర్థికాభివృద్ధి సాధ్యం కావడమే కాకుండా అనేక మంది ప్రాణాలను రక్షించినట్లు అవుతుంది. అయితే, కాలానుగుణంగా మారిన సాంకేతికత, ఇతర మార్పులను క్షేత్రస్థాయిలో, స్థానిక పరిస్థితులకు తగినట్లుగా అమలు చేస్తేనే ప్రయోజనం ఉంటుంది.
ఇవీ చదవండి: