అమెరికాలో మారోమారు కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్ ఏఅండ్ఎం విశ్వవిద్యాలయంలోని కామర్స్ క్యాంపస్లో ఓ ఆగంతుకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రైడ్ రాక్ రెసిడెన్స్ హాల్ వద్ద ఈ ఘటన జరిగినట్లు యూనివర్సిటీ పోలీసులు తెలిపారు. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. హింసాత్మక ఘటనపై దర్యాప్తు చేపట్టి.. విశ్వవిద్యాలయంలో ముందస్తు జాగ్రత్తగా షెల్టర్ ఏర్పాటు చేయాలని క్యాంపస్ అధికారులను కోరినట్లు పేర్కొన్నారు.
తరగతుల రద్దు..
కాల్పుల అనంతరం.. ప్రైడ్ రాక్, దాని పరిసర ప్రాంతాలను మూసివేసినట్లు తెలుపుతూ.. నోటీసులు జారీ చేసింది కళాశాల యాజమాన్యం. తరగతులను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.
2016, ఆగస్టులో లైసెన్స్ కలిగి.. ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే చేతి తుపాకీ కలిగిన వారు క్యాంపస్లో తిరిగేందుకు అనుమతులు ఉన్నాయని, క్యాంపస్లో తుపాకీని దాచేందుకూ వీలుందని పోలీసులు తెలిపారు. అలాంటి వారే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు.
1600 మంది భారతీయ విద్యార్థులు..
2018 విద్యార్థి వీసా లెక్కల ప్రకారం అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థులు 1,83,312. టెక్సాస్ ఏఅండ్ఎం విశ్వవిద్యాలయంలో సుమారు 1,607 మంది భారతీయ విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: పాఠశాలలో తొక్కిసలాట.. 13 మంది చిన్నారులు మృతి