అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాక చైనా వస్తువులపై సుంకాలు పెంచి ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి తెర తీశారు డొనాల్డ్ ట్రంప్. అప్పటి నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య పోరు జరుగుతూనే ఉంది.
సెప్టెంబరు 1నుంచి చైనా వస్తువులపై మరోసారి సుంకాల మోత మోగించనున్నారు ట్రంప్. ఈ చర్యతో చైనా నుంచి 13 శాతం కంపెనీలు తిరుగుముఖం పడతాయని జోస్యం చెప్పారు. శ్వేతసౌధంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
సుంకాల పెంపును చైనాలోని కంపెనీలు భరించలేవన్నారు ట్రంప్. ఆ దేశం నుంచి వెళ్లిపోయే కంపెనీల సంఖ్య 13శాతం దాటినా ఆశ్యర్యపోనవసరం లేదని అభిప్రాయపడ్డారు. తాము నూతనంగా విధించే సుంకాలతో చైనా కంపెనీలు పోటీలో నిలబడలేవని స్పష్టం చేశారు.
చైనా నుంచి ఇప్పటికే చాలా వ్యాపార సంస్థలు వెళ్లిపోతున్నాయని చెప్పిన ట్రంప్.. గత 61 ఏళ్లలో అత్యంత విపత్కర పరిస్థితిని చైనా ఈ ఏడాది ఎదుర్కొంటుందన్నారు.
అమెరికా-చైనా మధ్య సెప్టెంబరులో జరగాల్సిన సమావేశం యథావిధిగా ఉంటుందని భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. సంకాలు అమెరికాను చర్చల పరంగా ఉన్నత స్థాయిలో నిలిపాయన్నారు.
ఇదీ చూడండి: డొమినికన్ రిపబ్లిక్లో 'గాంధీజీ' పోస్టల్ స్టాంప్