ఫైజర్ టీకాను స్వీకరించిన అమెరికాకు చెందిన నర్సుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొద్ది రోజుల క్రితమే ఆమె కొవిడ్-19 టీకా మొదటి డోసు తీసుకున్నారని అమెరికన్ మీడియా సంస్థ వెల్లడించింది. టీకా వేయించుకున్న అనంతరం డిసెంబర్ 18న ఆ విషయాన్ని ఫేస్‌బుక్‌లో కూడా పోస్టు చేశారు. ఒక రోజు మొత్తం చేయినొప్పి పెట్టడం మినహా ఇతర దుష్ప్రభావాలేమి లేవని అందులో వెల్లడించారు.
కాగా, విధుల్లో భాగంగా కొవిడ్ యూనిట్‌లో పనిచేసిన అనంతరం ఆ నర్స్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. వణుకు, కండరాల నొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపించాయి. వెంటనే పరీక్షలు నిర్వహించగా క్రిస్మస్ పండుగ మరుసటి రోజు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనిపై శాన్‌డియాగోకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు క్రిస్టియన్ రామర్స్ మీడియాతో మాట్లాడారు. ‘ఇది ఊహించని విషయమేం కాదు. టీకా నుంచి రక్షణ లభించడానికి 10 నుంచి 14 రోజులు పడుతుందని క్లినికల్ ట్రయల్స్ నుంచే మాకు తెలుసు. మొదటి డోసు నుంచి 50 శాతం రక్షణ ఉంటుందని భావిస్తున్నాం, 95శాతం సామర్థ్యం పొందాలంటే రెండో డోసు తీసుకోవాలి’ అని రామర్స్ వెల్లడించారు.
ఇదీ చదవండి: మా టీకా సామర్థ్యం..79శాతం: చైనా