కరోనా, లాక్డౌన్లతో చిన్నారుల్లో మానసిక, శారీరక ఎదుగుదల లోపించిందని యూనిసెఫ్ శుక్రవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. అల్జీరియా, ఈజిప్ట్, జోర్డాన్, మొరాకో, ఖతార్, సిరియా, టునీషియా దేశాల్లో ఏప్రిల్ నుంచి జులై మధ్య 7 వేల కుటుంబాలపై సర్వే నిర్వహించి, ఈ నివేదిక రూపొందించింది.
ఇందులో 90శాతం కుటుంబాలు కరోనా తమ పిల్లల జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని తెలిపాయి. దాదాపు 40శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై ఆందోళనలో ఉన్నట్లు చెప్పారు. 30శాతం మంది తమ పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని వెల్లడించారు.
పాఠశాలలు మూసివేయటం వల్ల చిన్నారుల దినచర్య దెబ్బతిన్నదని యూనిసెఫ్ ప్రాంతీయ డైరెక్టర్ టెడ్ చైబన్ వివరించారు. గృహ హింస సైతం పెరిగిందని తెలిపారు.