కెన్యాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నైరోబి సమీప కాకమెగా నగరంలోని కాకమెగా ప్రాథమిక పాఠశాలలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 13 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు అధికారులు.
పాఠశాలలో ప్రమాదం పొంచి ఉందని విద్యార్థుల్లో భయాందోళనలు చెలరేగి తొక్కిసలాటకు కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు అధికారులు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పాఠశాల వదిలిన క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
"ఈ తొక్కిసలాటలో 13 మంది పిల్లలను కోల్పోయాం. మిగతా వారు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు."
- డేవిడ్ కబెన, కాకమెగా నగర పోలీసు కమిషనర్
అయితే ఈ ప్రమాదం వెనకగల కారణాలు ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు డేవిడ్. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
అత్యవసర విభాగాలు సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు కెన్యా రెడ్ క్రాస్ సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్: గూగుల్‌తో జతకట్టిన డబ్ల్యూహెచ్ఓ