ఇటీవల దక్షిణాఫ్రికాలోని ఓ మహిళ ఒకే కాన్పులో 10 మంది పిల్లలకు జన్మనిచ్చిందనే వార్త నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇంత మందిని కన్నందుకు ఈమెకు గిన్నిస్ రికార్డ్ ఖాయం అని అనుకున్నారు అంతా! అయితే.. ఇప్పుడు ఇందులో కొత్త ట్విస్ట్ వచ్చింది. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన దర్యాప్తులో అసలు ఈమె పిల్లలనే కనలేదు అనే విషయం తెలిసింది. అంతే కాదు.. అసలు ఈమె గర్భవతి కూడా కాదని వెల్లడైంది. ఇందుకు సంబంధించి అక్కడి ప్రభుత్వం జూన్ 23న ప్రకటన విడుదల చేసింది.
ఇదీ జరిగింది..
దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ ప్రావిన్స్‌కు చెందిన గొసియామి థమరా సిథోలే జూన్ 7న 10 మంది పిల్లలకు జన్మనిచ్చినట్లు స్థానిక వార్తా సంస్థ పేర్కొంది. ఈ మేరకు జూన్ 9న వార్తను ప్రచురించింది. ఈ వార్త వైరల్‌గా మారింది.
సిథోలేకు స్టీవ్ బికో అకాడమిక్ ఆసుపత్రిలో కాన్పు జరిగిందని.. అక్కడి వైద్యల నిర్లక్ష్యం కారణంగా ఆమెకు ప్రసవానికి ఇబ్బంది పడింది అంటూ అందులో పేర్కొంది. దీనిపై స్పందించిన స్థానిక ప్రభుత్వం.. దర్యాప్తును ప్రారంభించింది. ఈ క్రమంలో అధికారులకు.. సిథోలే అసలు కాన్పుకు ఆ ఆసుపత్రికే రాలేదని తెలిసింది. అంతే కాదు.. అక్కడున్న ఏ ఆసుపత్రిలో ఆమెకు ప్రవసం జరిగినట్లు సమాచారం లేదు.
వైద్య సిబ్బంది సిథోలేను సంప్రదించగా ఆ సమయంలో ఆమెకు కాన్పు జరగలేదని తెలిసింది. ఇందుకు సంబంధించి జూన్ 18న ఆమెకు పరీక్షలు నిర్వహించారు. ఇటీవల కాలంలో సిథోలే అసలు గర్భం దాల్చనట్టు పరీక్షల్లో తేలింది. సిథోలే మానసిక స్థితి పట్ల అనుమానం వ్యక్తం చేసిన వైద్యులు.. ఆమెను పర్యవేక్షిస్తున్నారు.
ఇదీ చదవండి : అద్భుతం: ఒకే కాన్పులో 9 మంది జననం